Articles

మళ్లీ మెుదటికి!


విదేశాల్లోని నల్లధనం తిరిగి తెప్పించే అంశంపై పిల్లి మొగ్గలు వేయడం నరేంద్రమోడీ ప్రభుత్వానికి కొత్తేమో గానీ ఆ ప్రకటనలు వినే ప్రజలకు మాత్రం కొత్త కాదు. చాలా కాలంగా అంటే యుపిఏ పదేళ్ల పాలన నుంచి కూడా అధికారంలో ఉన్న వారు ఈ అంశంపై కప్పదాటు ప్రకటనలు చేయడం పరిపాటిగా మారింది. నల్లధనం ఖాతాలున్నవారి పేర్లను బయటపెట్టాలన్న అంశంపై ఎన్డీఏ ప్రభుత్వం యూ టర్న్‌ తీసుకున్నదని వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలను చూసి ఆశ్చర్యపోయినట్లు ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ అంటున్నారు. ఇందులో ఆయన అంతగా ఆశ్చర్యపడాల్సిన అంశమేం లేదు. ఎందుకంటే అరుణ్‌జైట్లీ అంతకుముందు మాట్లాడిన మాటలన్నీ ఇదే అభిప్రాయాన్ని కలుగచేస్తున్నాయి. 

గత రెండు రోజులుగా జరిగిన పరిణామాలు చూస్తే దేశంలోని ప్రజలు ఎన్‌డిఏ ప్రభుత్వం యూటర్న్‌ తీసుకున్నట్లు ఎందుకు భావిస్తున్నారో అరుణ్‌జైట్లీకి ఈపాటికే అర్ధమైఉండాలి. కొన్ని దేశాలతో భారత్‌ ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందం (డిటిఏఏ) కుదుర్చుకుందని అ దేశాలకు సంబంధించిన బ్యాంకు ఖాతాల వివరాలను మాత్రం బహిర్గతం చేయలేమని మోడీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. వివిధ దేశాలతో కుదుర్చుకున్న ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందం ఆధారంగా భారత్‌ ఆయా దేశాల నుంచి నల్లధనం వివరాలను సేకరించింది. ఇలాంటి సమాచారాన్ని బహిర్గతం చేయడానికి విదేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయని సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో కేంద్రం పేర్కొంది. ఇలాంటి వివరాలను బహిర్గతం చేస్తే మరే దేశం కూడా భవిష్యత్‌లో భారత్‌తో ఇలాంటి ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ముందుకు రాబోదని తెలిపింది. 

ప్రధాన న్యాయమూర్తి హెచ్‌ఎల్‌ దత్తు నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు హాజరయిన అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గి తన వాదన వినిపిస్తూ పైనపేర్కొన్న అంశాన్ని అత్యవసరంగా విచారించాలని కోర్టును కోరారు. కేంద్రం వైఖరిపట్ల సీనియర్‌ న్యాయవాది రాంజెత్మలాని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం చెబుతున్న ఈ అంశాన్ని విచారించకూడదని ఆయన కోర్టును కోరారు. రాంజెత్మలాని దాఖలు చేసిన పిటిషన్‌పైనే అత్యున్నత న్యాయస్థానం నల్లధనంపై ప్రత్యేక ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ (సిట్‌)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కేంద్రం చెబుతున్న అంశాన్ని ఒక్కరోజు కూడా పరిగణనలోకి తీసుకోకూడదు అని జెత్మలానీ కోరారు. ఇలాంటి అప్లి కేషన్‌ను దోషులు మాత్రమే సమ ర్పించాల్సి ఉంటుందని, ప్రభుత్వం కాదని ఆయన పేర్కొన్నారు. 

విదేశీ బ్యాంకుల్లో నల్లధనం పోగుచేసుకున్న వారిని రక్షించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని జెత్మలానీ ఆరోపించారు. ఈ అంశంపై తాను ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశానని, సమాధానం కోసం వేచిచూస్తున్నట్టు ఆయన వివరించారు. భారత పౌరులు విదేశీ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసినదంతా నల్లధనం అని చెప్పలేమని అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గి అన్నారు. విదేశీ బ్యాంకుల్లో ఖాతా తెరవడం నేరం కాదని ఆయన పేర్కొన్నారు. నల్లధనంపై విచారిస్తున్న సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు హాజరయిన అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇటీవల జారీ చేసిన ఆదేశాలను సవరించాలని కోరుతూ కేంద్రం ఒక అప్లికేషన్‌ను సమర్పించినట్టు తెలిపారు.

ఇది యూ టర్న్‌ కాదా? 
యుపిఏ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్నందున నల్లధనం వివరాలను బయటకు చెప్పలేమని కేంద్రం వాదించడం ఖచ్చితంగా యూటర్నే అవువుతుంది. నల్లధనం వెలికి తెస్తామని, విదేశాల నుంచి నల్లధనం వెలికి తీసుకురావడం ద్వారా దేశంలో పేదరికం రూపుమాపుతామని బిజెపి ఎన్నికల ముందు చెప్పలేదా? డిటిఏఏ ఒప్పందాల ప్రకారం సదరు వివరాలు వెల్లడించలేమని చెప్పిన యుపిఏ ప్రభుత్వాన్ని ఇదే బిజెపి ఎండ గట్టలేదా? కేంద్రంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన నివేదిక పై విధంగా ఉన్నట్లు వెల్లడి కావడంతో ఈ ప్రశ్నలు తలెత్తడం సహజమేకదా? యుపిఏ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను యధాత థంగా అమలు చేయాల్సిన అనివార్య పరిస్థితులు ఉంటే వాటిని సరిదిద్దడానికే కదా ఎన్‌డిఏకు ప్రజలు పట్టంకట్టింది.

యుపిఏ అధికారంలో ఉన్నపుడు చేసిన విమర్శలను ఒక్క సారి పునశ్చరణ చేసుకుని దానికి అనుగుణంగా నడవాల్సిన ఆవశ్యకత మాత్రం మోడీ ప్రభుత్వంపై ఖచ్చితంగా ఉంటుందనడంలో సందేహం లేదు.నల్లధనంపై సమాచారం కోసం ఎన్డీఏ ప్రయత్నం కొనసాగుతూనే ఉందని, బాధ్యులపై చట్టపరమైన చర్యలకు కట్టుబడి ఉన్నామని జైట్లీ స్పష్టం చేస్తున్నా కూడా అది విశ్వాసం కలిగించడం లేదు. ఈ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తే, కొన్ని దేశాలతో ఉన్న ఒప్పందాలను ఉల్లంఘించవలసి వస్తుందని, అప్పుడు నల్లధనంపై ఆయా దేశాలనుంచి సహకారం తగ్గిపోతుందని ఆయన అనడం తీవ్రమైన అవకాశవాదం కిందకే వస్తుంది. దూకుడుగా వ్యవహరిస్తే నల్లధనం ఖాతాలున్నవారికే ప్రయోజనం కలుగుతుందని జైట్లీ వ్యాఖ్యానించారు.

అంతకు ముందు ఆర్ధిక మంత్రిగా ఉన్న చిదంబరం చెప్పింది కూడా ఇదే కదా? మరి నాలుగు నెలల కాలంలో తత్వం బోధపడిందా? నల్లధనంపై యుపిఏ ప్రభుత్వం చెప్పిన విషయాలనే చెప్పేందుకు జైట్లీ ఎందుకు? ఈ అనుమానాలు దేశ ప్రజల్లో బలంగా నాటుకుపోక ముందే మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నల్లధనం వెలికి తెప్పించేందుకు సిట్‌ ఏర్పాటు చేసిన ఘనత నుంచి మోడీ ప్రభుత్వం తప్పించుకోకూడదు. సుప్రీంకోర్టు చెప్పినట్లు ఇంతకాలం నడచుకున్న ఎన్‌డిఏ ప్రభుత్వం అకస్మాత్తుగా డిటిఏఏ అంశాన్ని వెలికితీసుకురావడమే అనుమానం కలిగిస్తున్నది.
నల్లధనం దాచిన వారివివరాలను బహిర్గతం చేయాలని అధికారంలోకి రాకముందు చేసిన డిమాండ్‌ను గుర్తుకు తెచ్చుకుని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. 

నల్లధనం అంశంపై ఎన్డీఏ సర్కార్‌ వెనకడుగువేసిందన్న విమర్శలను జైట్లీ ఖండిస్తున్నారు. విదేశాల్లో నల్లధనం దాచిన ఖాతాదార్ల పేర్ల సహా, ఎలాంటి సమాచారాన్ని ప్రభుత్వం దాచి ఉంచబోదని ఆ తర్వాత జైట్లీ చెబుతున్నారు. కానీ అంతకు మించిన పని చేయడం లేదు. అదే ఇప్పుడు దేశానికి అవసరం. నల్లధన వివరాలను అందించేందుకు స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం ముందుకు వచ్చిన ఈ తరుణంలో వెనక్కిలాగడం భావ్యం కాదు.