Articles

అయోమయంలో కాంగ్రెస్‌

2004లో తిరిగి అధికారంలోకి వచ్చి వరుసగా పది సంవత్సరాల పాటు సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం వహించిన కాంగ్రెస్‌ పార్టీకి ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చోవలసి రావడం మింగుడు పడడం లేదు. దానికి తోడు తగినంత సంఖ్యాబలం లేక లోక్‌సభలో ప్రతిపక్ష సారథ్యం కూడా దక్కలేదు. ప్రతిపక్షంలో ఉన్నందున ప్రభుత్వ ప్రతి కార్యక్రమాన్నీ విమర్శించడమే తన పని అని ఆ పార్టీ భావిస్తున్నట్లు ఉంది. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో మంచి కనిపించినప్పుడు తమ పార్టీ నాయకులు ఎవరైనా, తుదకు సీనియర్లు అయినా దానిని శ్లాఘిస్తే కాంగ్రెస్‌ సహించలేకపోతోంది. వెంటనే అటువంటి నేతల నోళ్లకు తాళం వేయడానికి ఆ పార్టీ పూనుకుంటోంది.... తన సన్నిహితుల మధ్యే ఏకాభిప్రాయాన్ని సాధించలేకపోతున్న రాహుల్‌ పార్టీలో వ్యవహారాలను ఏవిధంగా చ…క్కదిద్ది పార్టీని తిరిగి ఒడ్డుకు చేరుస్తారనేది ప్రశ్నే! 

నూట ఇరవై తొమ్మిదేళ్ల చరిత్ర గల కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుతం అగమ్యగోచర స్థితిని ఎదుర్కొంటున్నది. 2004లో తిరిగి అధికారంలోకి వచ్చి వరుసగా పది సంవత్సరాల పాటు సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం వహించిన కాంగ్రెస్‌ పార్టీకి ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చోవలసి రావడం మింగుడు పడడం లేదు. దానికి తోడు తగినంత సంఖ్యాబలం లేక లోక్‌సభలో ప్రతిపక్ష సారథ్యం కూడా దక్కలేదు. ప్రతిపక్షంలో ఉన్నందున ప్రభుత్వ ప్రతి కార్యక్రమాన్నీ విమర్శించడమే తన పని అని ఆ పార్టీ భావిస్తున్నట్లు ఉంది. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో మంచి కనిపించినప్పుడు తమ పార్టీ నాయకులు ఎవరైనా, తుదకు సీనియర్లు అయినా దానిని శ్లాఘిస్తే కాంగ్రెస్‌ సహించలేకపోతోంది. వెంటనే అటువంటి నేతల నోళ్లకు తాళం వేయడానికి ఆ పార్టీ పూనుకుంటోంది. ఆమధ్య జమ్ము కాశ్మీర్‌లో వరదలు బీభత్సం సృష్టించినప్పుడు నరేంద్ర మోడి దేశ ప్రధానిగా చొరవ చూపి, రక్షణ, సహాయ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగా ఆయనను కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మధ్య ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌ సింగ్‌ కొనియాడితే కాంగ్రెస్‌ ఆయనను తప్పు పట్టి, తమ దారిలోకి తిరిగి తెచ్చుకునే ప్రయత్నం చేసింది. ప్రధాని మోడి ఈ నెల 2న దేశవ్యాప్తంగా `స్వచ్‌‌ఛ భారత్‌\' కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజలంతా ఇందులో భాగస్వాములు కావాలని ఒక వైపు కోరుతూ తొమ్మిది మంది ప్రముఖుల పేర్లు ప్రస్తావించి వారిని ఇందులో పాలు పంచుకోవాలని మరో వైపు పిలుపు ఇవ్వగా వారిలో ఒకరైన కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్‌ సానుకూలంగా స్పందించడమే కాకుండా ట్విట్టర్‌లో ప్రధానిని పొగిడారు. ఇది థరూర్‌ స్వరాష్ర్టం కేరళలో కాంగ్రెస్‌ నాయకులను ఆగ్రహానికి గురి చేసింది. కాషాయ పార్టీకి చెందిన నరేంద్ర మోడిని ప్రశంసించడమేమిటని వారు ఆయనను నిలదీసినంత పని చేశారు. థరూర్‌ తన వైఖరిని సమర్థించుకుంటూ తాను పొగిడింది ఆయన చేపట్టిన జనహిత కార్యక్రమం `స్వచ్‌‌ఛ భారత్‌\'నే గాని ఆయన పార్టీని కాదని అన్నారు. తాను ఎప్పటికీ కాంగ్రెస్‌ వాదిగానే ఉంటానని థరూర్‌ స్పష్టం చేశారు కూడా. కాషాయ పరివారానికి చెందిన ప్రధానిని కొనియాడితే తమకు ఒక వర్గం వారి వోట్లు దూరమవుతాయేమోననే శంక కాంగ్రెస్‌ వారిని వేధిస్తున్నట్లున్నది. 

కేంద్రంలో అధికారాన్ని కోల్పోయిన పరిస్థితులకు ఇంకా అలవాటు పడలేకపోతున్న కాంగ్రెస్‌ పార్టీ ఇంకొక వైపు అంతర్గత వైమనస్యాలతో సతమతం అవుతోంది. సీనియర్లు, జూనియర్లు మధ్య వైరుధ్యాన్ని పార్టీ అగ్ర నేతలు సరిదిద్దలేకపోతున్నారు.మరి వారం రోజుల్లో రెండు రాష్ట్రాల్లోను, ఆ తరువాత మరి కొన్ని రాష్ట్రాల్లోను శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు ముమ్మరమయ్యాయి. ఆరోగ్య సమస్యల కారణంగా తన తల్లి, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధి దైనందిన పార్టీ బాధ్యతలకు దూరంగా ఉంటున్నందున పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధి పార్టీలో వ్యవహారాలను చక్కదిద్దడంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తనదైన వ్యూహంతో సాగుతున్న రాహుల్‌, పార్టీలో యువతకు ఇతోధిక పాత్ర కల్పించడానికి ఇష్టపడుతున్నారు. అలా అని ఇన్నేళ్లుగా పార్టీకి సేవలు అందించిన సీనియర్‌ నేతలను పక్కకు తప్పించలేకపోతున్నారు. అయితే, యువతకు రాహుల్‌ ఇస్తున్న ప్రోత్సాహాన్ని గమనించిన కొంత మంది జూనియర్‌ నేతలు ఆయనకు సన్నిహితులు అయ్యేందుకు, ఆయన పంచన చేరేందుకు నానా ప్రయాస పడుతున్నారు. పార్టీలో తమ పదవులను ఏదో విధంగా కాపాడుకోవాలన్నది వారి తాపత్రయం. ఆ క్రమంలో సీనియర్లపై విమర్శలకూ వారు వెనుకాడడం లేదు. ఇది అంతకంతకు శ్రుతి మించుతుండడంతో రాహుల్‌ జోక్యం చేసుకోవలసి వచ్చింది. పార్టీలో ఎటువంటి వివాదాలూ వద్దని ఆయన వారిని ఆదేశించారు. గత ఎన్నికలకు ముందు దేశంలోని పలువురు నేతలు గ్రామ స్థాయిలో పార్టీని కాపాడుకోలేకపోయారనే అపప్రథ ఉంది. పార్టీ ఆ కారణంగానే పలు రాష్ట్రాలలో దారుణమైన ఫలితాలు చవి చూసిందని తేలింది. అప్పట్లో పార్టీ పరాయానికి కారకులైన వారంతా ఇప్పుడు ఏదో విధంగా రాహుల్‌ పక్షాన చేరేందుకు తాపత్రయపడుతున్నారు. పార్టీలో సీనియర్‌ నేతలను, ఓటమికి కారకులను పక్కకు తప్పించి యువ నేతలకు పదవులను అప్పగించే యోచనలో రాహుల్‌ ఉన్నట్లు గ్రహించిన నేతలు ఆయనను మంచి చేసుకునే యత్నంలో ఉన్నారు. అయితే, మహారాష్ర్ట, హర్యానా తదితర రాష్ట్రాలో అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ తరఫున ప్రచారంలో రాహుల్‌ ఇంత వరకు చురుకుగా పాల్గొనడం లేదు. 

ఆయన దృష్టంతా 2019లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలపైనే ఉన్నట్లుంది. ఆ ఎన్నికలకు సంబంధించిన వ్యూహాన్ని ఆయన ఇప్పటి నుంచే రూపొందిస్తున్నారని తెలుస్తోంది. గత ఎన్నికలలో తాను కీలక బాధ్యతలు అప్పగించిన యువ నేతలు కొందరికి 2019 ఎన్నికలకు కూడా బాధ్యతలు కేటాయించాలని రాహుల్‌ ఆలోచిస్తున్నారు. ఆ దిశగా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారు కూడా. కాని ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు సీనియర్‌ నేతలకు రుచించడం లేదు. యువ నేతలకు పగ్గాలు అప్పగించాలని అనుకుంటున్న రాహుల్‌ తమంతట తాము తప్పుకోవాలని సీనియర్లకు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇది పార్టీలో వివాదానికి దారి తీస్తోందని సీనియర్‌ నేతలు చెబుతున్నారు. రాహుల్‌ ఆలోచనలు ఉన్నతమైనవే అయినప్పటికీ ఆయన కోరుకున్నంత మార్పు ఇప్పట్లో రావడం కష్టమని వారు వాదిస్తున్నారు. తాము అటువంటి పరిస్థితిని రానివ్వబోమని, కాంగ్రెస్‌కు జీవిత కాలం సేవలు అందించాలనుకుంటున్న తమను ఎవరూ బయటకు పంపలేరని సీనియర్‌ నేత ఒకరు స్పష్టం చేశారు. అయినా సీనియర్లను కాదని, కొత్త వారిని పార్టీలో ఉన్నత పదవులలో కూర్చోబెట్టడం సరి కాదని ఆయన వాదించారు. అటువంటి పని తల్లి, పిల్లలను వేరు చేసినట్లు అవుతుందని ఆయన అన్నారు. పార్టీలో రాహుల్‌కు అంతేవాసిగా పేరు పడిన సీనియర్‌ నేత ఒకరు ఆయన ముందు చేసిన అటువంటి ప్రతిపాదనను ఆయనకు అత్యంత సన్నిహితుడైన ఒక నేత వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. తన సన్నిహితుల మధ్యే ఏకాభిప్రాయాన్ని సాధించలేకపోతున్న రాహుల్‌ పార్టీలో వ్యవహారాలను ఏవిధంగా చక్కదిద్ది పార్టీని తిరిగి ఒడ్డుకు చేరుస్తారనేది ప్రశ్నే!

\r\n