Articles

ప్రజలకు చికాకు కలిగించకూడదు


తెలంగాణ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చికాకు పెడుతున్నారు- ఇది తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ గవర్నర్‌ నరసింహన్‌కు చేసిన ఫిర్యాదు! పాలన చేతకాక నాపై కెసిఆర్‌ ఆరోపణలు చేస్తున్నారు- టిడిపి పాలిట్‌ బ్యూరో సమావేశంలో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్య!!
ఈ రెండు వార్తలు చదివితే, ఈ రెంటిలో ఎంతో కొంత వాస్తవం ఉందన్న అభిప్రాయం కలగుతుంది. అందుకు కారణాలు ఉన్నాయి. అలాగని చంద్రబాబు అచ్చంగా తెలంగాణ ప్రభుత్వాన్ని అదే పనిగా చికాకు పెడుతున్నారని కాదు. అలాగే కెసిఆర్‌ అసలు పాలన చాతకాకుండా ఉన్నారనీ కాదు. శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రం నుంచి జల విద్యుత్‌ ఉత్పత్తి చేయడంపై ఎపి ప్రభుత్వం అభ్యంతరం చెప్పడంతో వివాదం ఆరంభం అయింది. శ్రీశైలంలో పూర్తి స్థాయి నీటి మట్టం ఉన్న సమయంలో కొంత జల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తారు. నిజానికి శ్రీశైలం ప్రాజెక్టును అసలు ఆరంభించినదే విద్యుత్‌ ఉత్పత్తి కోసం. కాని ఆ తర్వాత కాలంలో దానితోపాటు వివిధ ప్రాంతాలకు నీటి అవసరాలు తీర్చే ప్రధాన వనరుగా మారింది. ముఖ్యంగా రాయలసీమకు పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా నీటిని ఇవ్వడానికి ఎంతగానో ఉపయోగపడుతోంది. దానికి నీరు ఇవ్వాలంటే నిర్దిష్ఠ నీటి మట్టం కొనసాగుతుండాలి. అందుకే గతంలో చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 834 అడుగుల నీటి మట్టం కనీసంగా ఉండాలని విడుదల చేసిన జి.ఓ.ని వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మార్పుచేసి 854 అడుగులుగా నిర్ణయించారు. దీనిపై ఆ రోజులలో కోస్తాకు ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన టిడిపి నేతలు తీవ్రంగా అభ్యంతరం చెప్పారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావు, స్పీకర్‌గా ఉన్న డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు, సీనియర్‌ నేత దూళిపాళ్ల నరేంద్ర తదితరులు ప్రకాశం బ్యారేజీ వద్ద ధర్నాకు దిగారు. దానికి సహజంగానే పార్టీ అధినేతగా చంద్రబాబు మద్దతు ఉంటుంది. అప్పట్లో వై.ఎస్‌.ను- కడపకే సి.ఎమ్‌.గా వ్యవహరిస్తున్నారని, కోస్తాను ఎడారి చేయడానికే ఆ జి.ఓ ఇచ్చారని వారు విమర్శించారు. అదే సమయంలో తెలంగాణలో పలువురు కాంగ్రెస్‌ నేతలు కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అభ్యంతరం చెప్పారు. టిఆర్‌ఎస్‌ ఆనాడు ప్రభుత్వంలో ఉన్నా, దీనిపై ఆ తర్వాత రోజులలో పెద్ద విమర్శలే చేసింది. 

ఆ రోజులలో పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పెద్ద వివాదం. తదుపరి- కాలం మారింది. రాష్ట్రం విడిపోయింది. నేతల వైఖరులు మారిపోయాయి. ఇప్పుడు దేవినేని ఉమామహేశ్వరరావు ఎపి నీటిపారుదల శాఖ మంత్రి అయితే, తెలంగాణకు హరీష్‌ రావు నీటి పారుదల శాఖ మంత్రి అయ్యారు. వీరిద్దరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇద్దరూ- జి.ఓలలో ఏముందో చదువుకో- అంటూ విమర్శించుకుంటూ, ఎవరికి తోచిన భాష్యం వారు చెబుతున్నారు. తమ వాటా నీటిని విద్యుత్‌ వినియోగానికి వాడుకుంటామని,అది సేద్యపు నీటికిందే లెక్క అని హరీష్‌ రావు వాదన. అయితే విలువైన నీటిని వృథా చేస్తే రాయలసీమకు ఇతర ప్రాంతాలకు నీటి ఎద్దడి వస్తుందని ఉమా మహేశ్వరరావు వాదన. అంతేకాక కావాలంటే 300 మెగావాట్ల విద్యుత్‌ను తాము ఇస్తామని కూడా ఆయన ప్రకటించారు. ఇది వినడానికి బాగానే ఉంది. 800 మెగావాట్ల మేర, అది కూడా అతి చవకగా ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ కాకుండా, అధిక ధరకు కరెంటు ఎందుకు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ప్రశ్న. ఇలా వాదోపవాదాలు సాగిస్తూ రెండు ప్రాంతాలలో భయాందోళనలు రేకిత్తిస్తున్నారు. 

834 అడుగులకన్నా తక్కువ నీటిమట్టంఉన్నా, గతంలో ఎన్నిసార్లు విద్యుత్‌ వినియోగానికి నీటిని వాడుకోలేదు?- అని తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నిస్తే, అందుకు ఎపి ప్రభుత్వం సమాధానం చెప్పదు. అంతేకాదు, గతంలో ఇదే 107 జి.ఓ.ని రాజశేఖరరెడ్డి ప్రభుత్వం విడుదల చేసినప్పుడు గగ్గోలుపెట్టిన దేవినేని ఉమ ఇప్పుడు దానిని ఎందుకు సమర్ధిస్తున్నా రన్నదానిపై వివరణ ఇవ్వరు. అలాగే తెలంగాణ ప్రభుత్వం వైపు నుంచి కూడా కృష్ణా బోర్డుకు చెప్పకుండా ఎందుకు జలవిద్యుత్‌ ఉత్పత్తి చేశారన్న దానికి జవాబు ఉండదు. విశేషం ఏమిటంటే, ఎపి, తెలంగాణలు రెండూ కూడా శ్రీశైలంలో జల విద్యుత్‌ ఉత్పత్తి చేశాయి. కనీసం కృష్ణా నది యాజమాన్య బోర్డుకు ఇవి సమాచారం కూడా ఇవ్వలేదు. కాకపోతే ఎపి దీనిని ముందుగా తెలివిగా వివాదం చేసి, నీటిని తెలంగాణ ప్రభుత్వం కిందకు వదలిపెడుతూ సముద్రంపాలు చేస్తోందని, వచ్చే నెలలలో నీటి కొరత వస్తుందన్న భావన కలిగించడానికి ప్రయత్నం చేసి కొంతవరకు సఫలం అయింది. 

అలాగే, తెలంగాణకు అవసరమైన కరెంటు రానివ్వకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నారని, శ్రీశైలంలో ఆటంకం సృష్టిస్తున్నారని- తెలంగాణలో ప్రచారం చేయడంలో టిఆర్‌ఎస్‌ కొంతవరకు సక్సెస్‌అయింది. అందులో భాగంగానే ధర్నాలు, టిడిపి ఆఫీస్‌ పై దాడి, దహనకాండ వంటివి జరిపించింది. ఈ నేపథ్యంలో ముందుచూపు, దొంగచూపు వాదోపవాదాలు జరిగాయి. తనది ముందు చూపు అని చంద్రబాబు వ్యాఖ్యానిస్తే, కాదు దొంగచూపు, కుట్ర చూపు- అని కెసిఆర్‌ తీవ్రంగా విమర్శించారు. అంతేకాక చంద్రబాబును చీటర్‌ అని, మరొకటి అని ఇష్టరీతీన నిందించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, గవర్నర్‌ నరసింహన్‌ కూడా కెసిఆర్‌ తిట్ల దండకాన్ని టీవీలలో ప్రత్యక్ష ప్రసారం వస్తుండగా చూశారట.ఆ తర్వాత కెసిఆర్‌ తనను కలిసినప్పుడు మరీ అంత తీవ్రంగా విమర్శించుకుంటారా అని అడిగారట. అందుకు కెసిఆర్‌ సమాధానం ఇస్తూ తరచూ తెలంగాణ ప్రభుత్వ విషయాలలో చంద్రబాబు జోక్యం చేసుకుంటూ చికాకు పెడుతున్నారని, అందువల్ల అలా సీరియస్‌ కావల్సి వచ్చిందని, గతంలో పిపిఎల వివాదం మొదలు ఆయా అంశాలలో జరిగిన పరిణామాలపై తన వాదన వినిపించారట. 

చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వంపై వ్యాఖ్యానించడానికి కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఖమ్మంనుంచి తుమ్మల నాగేశ్వరరావును, టిడిపి ఎమ్మెల్యేలు ముగ్గురిని టిఆర్‌ఎస్‌లోకి ఆకర్షించడం చంద్రబాబుకు అసంతృప్తి కలిగించిందని, తత్సంబందిత పరిణామాలలో చంద్రబాబు విద్యుత్‌ విషయంలో కెసిఆర్‌కు ముందు చూపు లేదని వ్యాఖ్యానించారని అంటున్నారు. ఆ తర్వాత కెసిఆర్‌కు పాలన చేతకావడం లేదన్న వాదనను తెరపైకి తెచ్చి టిఆర్‌ఎస్‌ను బలహీనపర్చడం ద్వారా తెలంగాణ రాష్ట్రం విఫలం అయిందన్న భావన కలిగించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని టిఆర్‌ఎస్‌ వర్గాలు అబిప్రాయ పడుతున్నాయి. దీనిని తిప్పికొట్టడం కోసం కెసిఆర్‌ తీవ్రంగా మాట్లాడారని అంటున్నారు. అందుకు ప్రతిగా టిడిపి నేతలు ఎరబ్రెల్లి దయాకరరావు, రేవంత్‌ రెడ్డి, పెద్దిరెడ్డి తదితరులు మరింత ఘాటుగా విమర్శించారు. కెసిఆర్‌ తాగినట్లు మాట్లాడారని, లఫంగుల సంఘానికి అధ్యక్షుడు కెసిఆరేనని- ఇలా తోచిన విధంగా మాట్లాడారు. 
ఈ వివాదం ఇలా సాగుతుండగా, తాము ఎక్కడ వెనుకబడిపోతామోనని కాంగ్రెస్‌ నేతలు కూడా తమవంతు పాత్ర పోషిస్తూ దూషణలకు దిగారు. టి.పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఏకంగా కెసిఆర్‌ రైతుహంతకుడని విమర్శించారు. చంద్రబాబును కూడా మోసగాడు అని వ్యాఖ్యానించినా, కొందరు కాంగ్రెస్‌ నేతలు చంద్రబాబును ఒకరకంగా మెచ్చుకున్నారు. ఆంద్ర రాషా్టన్రికి ముందస్తుగా కరెంటును కేంద్రం నుంచి తెచ్చుకోవడంలో చంద్రబాబు సఫలం అయ్యారని, కెసిఆర్‌ విఫలం అయ్యారని వారు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలకు సంబంధించి రోజూ పత్రికలలో కథనాలు వస్తున్నాయి. రాజకీయ పార్టీలు కూడా లెక్కలు చెప్పి మరీ విమర్శిస్తున్నాయి. 

గతంలో తెలంగాణ ఉద్యమం సందర్భంలో కూడా ఆత్మహత్యలపై ఇలాగే నిత్యం వార్తలు వస్తుండేవి. వాటిలో ఎన్ని తెలంగాణకోసం జరిగినవో, ఎన్ని వేరే కారణాలతో జరిగినవో అన్న దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాని ఏ రాజకీయ పార్టీ కూడా తెలంగాణలో దానిపై భిన్నంగా మాట్లాడే సాహసం చేయలేకపోయేది. దానికి కారణం టిఆర్‌ఎస్‌ ఎక్కడ విరుచుకు పడుతుందోనన్న భయం. ఇప్పుడు సరిగ్గా అదే అసా్తన్న్రి విపక్షాలు కెసిఆర్‌ పై ప్రయోగిస్తున్నాయి. టిఆర్‌ఎస్‌ కూడా రైతుల ఆత్మహత్యలను కాదనలేని పరిస్థితి. అలాగని వాటిని ధృవీకరించలేని వైనం. ఇలా తెలంగాణ రాజకీయం అప్పుడే వేడెక్కింది. ప్రధాన ప్రతిపక్ష పాత్రలో కాంగ్రెస్‌ ఉన్నా, టిడిపి ఉన్నంత యాక్టివ్‌గా లేదన్న భావన రాకుండా చూసుకోవడానికి తెలంగాణ కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. అలాగే తరచూ 2019 నాటికి తెలంగాణలో కూడా తామే అధికారంలోకి వస్తామని చంద్రబాబు చెబుతుంటారు. వీరికితోడు బిజెపికూడా తెలంగాణలో గట్టి పాగా వేయాలని ప్రయత్నిస్తోంది. ఈ ఆధిపత్య పోరు కారణంగానే తెలంగాణలో అప్పుడే ఉద్యమాలు, బస్‌ యాత్రలు, ధర్నాలు, ఆందోళనలు పెచ్చు పెరిగాయి.‚ ఆంధ్రప్రదేశ్‌లో విపక్షాలు ఇంకా అంత పోరాటపటిమను ప్రదర్శించలేక పోతున్నాయి. ప్రజలను పూర్తిగా తమవైపు తిప్పుకోలేకపోతున్నాయి. ఇంకా సమయం అవసరమని పార్టీలు భావిస్తున్నాయి.

తెలంగాణలో, ప్రభుత్వపరంగా చేసిన కొన్ని పనులు కూడా ఇబ్బంది పెట్టాయి. ఉదాహరణకు సమగ్రసర్వేలో జనం అందరినీ ఒకరకంగా అసౌకర్యానికి గురిచేశారు. తాజాగా సంక్షేమ పథకాలు కావాలంటే దరఖాస్తులు పెట్టుకోవాలన్న కొత్త చికాకును సృష్టించారు. ఇది టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం స్వయంకృతం. ఎనభై లక్షల మంది ప్రజలను రోడ్లపైకి తెచ్చి వారితో అక్షింతలు వేయించుకుంది. ఎంతో మంది ఇబ్బందికి గురి అయ్యారు.ఇది పాలనలో ఎదురైన అనుభవరాహిత్యం అన్న భావన ఉంది. దీని గురించి కెసిఆర్‌తో కూడా మాట్లాడామని, ఇందులో కొంత తప్పు జరిగిందని ఆయన కూడా అనుకుంటున్నారని, సర్దుబాటు చర్యలలో పడ్డారని ఒక టిఆర్‌ఎస్‌ నేత చెప్పారు. ఇక ఎపిలో చంద్రబాబు నాయుడు హుద్‌ హుద్‌ తుపాను సహాయ చర్యలలో హడావుడి చేయడం ద్వారా తనపై వ్యతిరేక వ్యాఖ్యలు రాకుండా జాగ్రత్తపడగలిగారు. నిజానికి తుపాను వచ్చిన పక్షం రోజుల తర్వాత కూడా అనేక గ్రామాలకు కరెంటు రాలేదు. అయినా చంద్రబాబు బాగానే చేశారులే అన్న భావన కల్పించడం లో ఆయన సఫలం అయ్యారు. అందుకు కారణం ఆయన అక్కడే ఉండి ఇన్‌వాల్‌‌వ అవడం కావచ్చు, లేదా ఇతర కారణాలు కావచ్చు. అయితే అంత మాత్రాన ఎపిలో పాలనపరమైన సమస్యలు లేవని కాదు. కెసిఆర్‌ రుణమాఫీకి సంబందించి ఒక విడత మొత్తాన్ని చెల్లించారు. కాని ఎపిలో ఇంకా ఆ ప్రక్రియ ఆరంభం కాలేదు. దీనితో రైతులు తమకు రావల్సిన బీమా సదుపాయం కోల్పోయారు. అలాగే డ్వాక్రా రుణాలను రద్దు చేస్తామని చెప్పినా, ఆ దిశగా ఇంకా ఏమీ జరగలేదు. కాని డ్వాక్రా మహిళలకు ఇసుక రేవులు ఇస్తున్నామని చెప్పి, కొంత ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వంపై అవకాశం దొరికినప్పుడల్లా వ్యాఖ్యానం చేస్తూ ఇక్కడ కెసిఆర్‌ను చికాకుకు పెట్టడంతోపాటు ఎపిలో కూడా తనకు ఆ సెంటిమెంట్‌ ఉపయోగ పడుతుందని ఆయన భావిస్తుండవచ్చు. 

ఇక ఎపిలో రాజధాని భూముల సమస్య, ఇతర హామీలు ఉన్నాయి. అయితే ఇప్పటికిప్పుడే అన్నిటిపైన ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయలేరు. కాని చంద్రబాబుకు వ్యతిరేకంగా అక్కడ రాజకీయ పార్టీలుకాని, ఆయా వర్గాలలో కాని పెద్దగా ఆందోళనలు రాకపోవడం ఆయనకు పాజిటివ్‌ పాయింట్‌ అయితే, తెలంగాణ సి.ఎమ్‌ కెసిఆర్‌ కు అంతవరకు నెగిటివ్‌ పాయింటేనని చెప్పాలి. అందువల్లనే కెసిఆర్‌ తీవ్రంగా స్పందించారు. అది ఎంత కోపం అంటే- మీడియా సమావేశం ముందు విలేకరులతో ఆఫ్‌ ద రికార్డులో మాట్లాడుతూ చంద్రబాబుపై ఒక అభ్యంతరకర పదం వాడారని టిడిపి నేతలకు సమాచారం అందింది. అయినా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు ఎదుటివారు ఎంత చికాకు పెడుతున్నా భాష విషయంలో నిగ్రహం పాటించకపోతే వారికే విమర్శలు వస్తాయి. అది సరైన విధానం కాదు. అలాగే చంద్రబాబు కూడా తరచూ కెసిఆర్‌ పాలన గురించి వ్యాఖ్యలు కాకుండా నియంత్రణగా ఉంటే బాగుంటుంది. అయితే రెండు ప్రాంతాలలో పార్టీ ఉన్న పరిస్థితిలో అది ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోవచ్చు. స్థూలంగా చెప్పాలంటే చంద్రబాబు, కెసిఆర్‌ రాజకీయంగా తెలివైన వ్యూహకర్తలే. చంద్రబాబు క్యాబినెట్‌లో కెసిఆర్‌ పనిచేశారు. ఒకరి ఆనుపానులు మరొకరికి తెలుసు. ఒకవైపు వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు, మరో వైపు వారి రాజకీయ పార్టీల మధ్య పోరాటం- ఇవన్నీ కలిసి రెండు రాషా్టల్రలోనూ పరిస్థితి కలగాపులగంగా మారుతోంది. ఏది ఏమైనా కెసిఆర్‌ను చంద్రబాబు చికాకు పెట్టకుండా ఉండి, కెసిఆర్‌ తన పాలనలో ప్రజలకు చికాకు కలిగించకుండా ముందుకు సాగితే- రెండు ప్రాంతాల ప్రజలకు సుఖంగా ఉంటుంది. కనుక వారిద్దరూ ప్రజలకు చికాకు కలిగించకుండా ఉంటే అదే పదివేలు.