Articles

తెలంగాణ తొలి బడ్జెట్‌


దాదాపు అరవై సంవత్సరాల సుధీర్ఘ కాలంపాటు అన్ని రంగాల్లో అనుభవించిన వివక్ష, వెనుకబాటుతనం తదితర కారణాలవల్ల కొత్త రాష్ర్టంలో, కొత్త ప్రభుత్వంపైన తెలంగాణ ప్రజానీకంలో నెలకొనిఉన్న అంచనాలు, దాదాపు 12 సంవత్సరాలపాటు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ ఇస్తున్న హామీలు, మరోవైపున వనరులకు సంబంధించిన వాస్తవ పరిస్థితుల నేపథ్యంలో- బుధవారం నాడు తెంగాణ రాష్ర్ట అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌ను పరిశీలించవలసిఉన్నది. ఐదు సంవత్సరాల ప్రజా ఉద్యమ ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ర్టంలో- ప్రభుత్వ పనితీరుపైనా, అది రూపొందించే పథకాలపైనా, అమలు జరిపే విధానాలపైన ప్రజల అంచనాలు గతంలోకంటే చాలా భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే, తెలంగాణ రాష్ర్ట సమితి (టిఆర్‌ఎస్‌) పార్టీ నాయకత్వంలో ఏర్పాటైన ప్రభుత్వంలో భాగస్వాములవుతున్న నాయకుల్లో చాలామంది తెలంగాణ రాష్ర్ట సాధన ఉద్యమంలో ప్రజలతో కలిసి పనిచేశారు. తెంగాణ రాష్ర్టం ఏర్పాటైతే అన్ని సమస్యల పరిష్కారానికి అవకాశాలు మెరుగవుతాయని పన్నెండు సంవత్సరాలుగా పూర్తిస్థాయి నమ్మకాన్ని కల్పించారు. తెలంగాణ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటిపైనా ఈ నాయకులు ఇంతకాలంగా లోతైన విశ్లేషణ ప్రజలకు అందించారు. సమస్యలకు నేపథ్యాన్ని ప్రజలకు వివరించారు. తాము మాత్రమే వాటిని పరిష్కరించగలమని జనసామాన్యాన్ని ఇంతకాలంగా నమ్మించగలిగారు. టిఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి- ఆ పార్టీ నాయకత్వం ఇంతకాలంగా ఇక్కడి సమస్యల పరిష్కారాల విషయంలో ప్రజల్లో కల్పిస్తున్న విశ్వాసాలు కూడా ఒక కారణమనేది నిర్వివాదాంశం. దీనికి తోడు టిఆర్‌ఎస్‌ పార్టీలో- అంతో ఇంతో స్వతంత్రంగా ఆలోచించగలిగేవారిలో ముఖ్యులుగా పేరున్న ఈటెల రాజేందర్‌ తొలి ఆర్థికమంత్రిగా, తొలిసారి బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న సందర్భాన్ని ప్రజలు మరింత ఆసక్తిగా గమనించారు. 

గతంలో ఏ ప్రభుత్వమూ చేయని రీతిలో, ఎన్నడూ లేని విధంగా టిఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వం తన తొలి బడ్జెట్‌ను రూపొందించేందుకు దాదాపు మూడు నెలలపాటు తీవ్రమైన కసరత్తు చేసింది. ప్రధాన శాఖలవారీగా ప్రత్యేకించి `టాస్‌‌క ఫోర్‌‌స కమిటీ\'లను రూపొందించింది. `మన ఊరు- మన ప్రణాళిక\' పేరుతో గ్రామస్థాయినుండి నివేదికలను క్రోడీకరించింది. ప్రభుత్వ ప్రణాళిక రంగంలోని నిపుణులతో సలహా, సంప్రదింపులు జరిపింది. ఇంతటి తతంగాన్ని గమనించిన వారిలో సహజంగానే తెంగాణ తొలిబడ్జెట్‌ పట్ల కొత్తఆశలు చిగురించి, ఆసక్తి మరింతగా పెరిగింది. అయితే, ప్రజలు ఆశించి నట్లుగా, గడచిన ఐదు మాసాల పాలనా కాలంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఎడతెరిపిలేకుండా ఇస్తున్న హామీలు, చేస్తున్న వాగ్దానాలకు తగినట్లుగా ఈ బడ్జెట్‌ ప్రతిపాదనలు ప్రతిబింబిస్తున్నాయా అనే ప్రశ్నలను పక్కకు పెడితే, రానున్న కాంలో టిఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వం అనుసరించదలుచుకున్న ప్యూహానికి సంబంధించిన ఆనవాళ్లు మాత్రం ఈ బడ్జెట్‌ ప్రతిపాదనల్లో స్పష్టంగానే కనిపిస్తున్నాయి. దేశంలో ఏపార్టీ ప్రభుత్వానికైనా వార్షిక ప్రణాళిక అనేది ప్రజలను తమవైపు ఆకర్షించు కోవడానికి, తమపట్ల ఎన్నికల్లో వ్యక్తీకరించిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి అందివచ్చిన అవకాశంగానే భావిస్తారు. 

ఈటెల రాజేందర్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను గమనిస్తే, టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వానికి కూడా ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులు లేవని కనిపిస్తుంది. గడచిన ఐదు మాసాలుగా టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వ పనితీరును గమనిస్తే రెండు ప్రధానమైన అంశాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. అందులో మొదటిది సమాజంలోని ప్రభావిత వర్గాలను సంతుష్టీకరణ విధానంతో చేరదీసుకోవడం. తెలంగాణ రాష్ర్ట సాధన ఉద్యమంలో నాయకత్వం స్థానంలో కీలకంగా వ్యవహరించిన ఉద్యోగవర్గాలకు తెంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి అనేక సందర్భాలలో పదేపదే చెబుతూవస్తున్నారు. ప్రభుత్వ చర్యలు కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ఖర్చు చేయడం ద్వారా కొత్త రాష్ర్టంలో ఎంతమందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారనే విషయం కనీసం ప్రస్తావించకపోవడం విద్యావంతులైన నిరుద్యోగుల్లో నిరాశను కలిగిస్తున్నది. కొత్త రాష్ర్టంలో పోలీసు వ్యవస్థపట్ల కూడా ఈ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తున్నది. ఒక్క రాజధాని నగరంలోని పోలీసు వ్యవస్థను మరింత పటి„ష్ఠ పరిచేందుకే బడ్జెట్‌లో దాదాపు 506 కోట్ల రూపాయలను కేటాయించారు. రెండవది నిర్థిష్టమైన ఓటుబ్యాంకును స్థిరీకరించుకోవడం. ఇందుకోసం టిఆర్‌ఎస్‌ పార్టీ దళిత, ఆదివాసీ, ముస్లిం మైనారిటీలను లక్ష్యంగా ఎంచుకున్నట్లు తెలుస్తున్నది. ఎస్సీ సబ్‌ప్లాన్‌కోసం రూ. 7579.45 కోట్లు, ఎస్టీ సబ్‌ప్లాన్‌ కోసం రూ. 4559.81కోట్లు, ముస్లిం మైనరిటీల సంక్షేమానికి ప్రత్యేకంగా రూ. 1030 కోట్లు కేటాయించారు. ఇవే కాకుండా రాష్ర్ట ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకానికి కూడా పై మూడు వర్గాలకు కలిపి 330 కోట్ల రూపాలయను అదనంగా కేటాయించారు. ఈ కేటాయింపులు నిజమైన లబ్ధిదారులకు చేరి, వారి జీవనప్రమాణాల్లో ఆశించిన ఫలితాలు రాగలిగితే సంతోషమే! . 

అయితే రాష్ర్ట జనాభాలో దాదాపు 50శాతంపైగా ఉన్న వెనుకబడిన తరగతుల అభివద్ధికోసం మాత్రం ఈ బడ్జెట్‌లో నామమాత్రంగా 2022 కోట్ల రూపాయలను కేటాయిస్తూ, చేతులు దులుపుకున్నారు. రాష్ర్టంలో వెనకబడిన తరగతుల జనాభా 45 శాతంగా ఉన్నట్లు పేర్కొనడం ఈ ప్రభుత్వానికి వెనకబడిన తరగతుల పట్ల ఉన్న నిర్లక్ష్యవైఖరికి నిదర్శనంగా కనిపిస్తున్నది. మొత్తంగా తెలంగాణ మొదటి బడ్జెట్‌ ప్రతిపాదనలు ప్రధానంగా వ్యవసాయం- సాగునీరు, పారిశ్రామిక రంగం, మౌలికవసతులు అనే మూడు అంశాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనిపిస్తున్నది. రెండువేల కోట్ల రూపాయల ఖర్చుతో తొమ్మిదివేల చెరువుల పునరుద్ధరణతో పాటుగా మొత్తం నీటిపారుదల రంగానికి 6500 కోట్ల రూపాయలను కేటాయించి, అదనంగా 2,97, 550 ఎకరాలకు సాగునీటి సౌకర్యాన్ని అందిస్తామని చెబుతున్నారు. రాష్ర్టంలో కొత్తగా డ్రింకింగ్‌ వాటర్‌ గ్రిడ్‌- ఏర్పాటు విషయంలో ఇంకా సమగ్రమైన చర్చ జరగకుండానే ఈ బడ్జెట్‌లో రెండువేల కోట్ల రూపాయలను కేటాయించారు. తెలంగాణలో రానున్న కాలంలో పారిశ్రామిక అభివృద్ధికి నూతన పారిశ్రామిక విధానానికి సంబంధించిన విధివిధానాలు రూపొందించకుండానే, ఏకంగా దాదాపు ఐదులక్షల ఎకరాల భూమిని తెలంగాణ స్టేట్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌కు అప్పగించేందుకు ప్రతిపాదించారు. ఇట్లాంటి చర్యలన్నీ అభివృద్ధి, సంక్షేమం పేరిట ప్రభుత్వాధినేతలు, వారికి అన్నిరకాలుగా సహకరించే బడాపారిశ్రామిక, పెట్టుబడీదారులకు ఊడిగం చేసేందుకు మాత్రమే ఉపయోగపడతాయి.

అయితే సాధారణ ప్రజానీకంలో ఎన్నో ఆశలు రేకెత్తించిన డబుల్‌బెడ్‌ రూమ్‌ గృహనిర్మాణం, తెలంగాణ అమరుల కుటుంబాలవారికి ఉద్యోగ అవకాశం, ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన విద్యార్థులకు భవిష్యత్తుపై భరోసా ఇచ్చే ప్రయత్నం, ఎన్నికల్లో ప్రధానహామీగా ప్రస్తావించిన రైతు రుణమాఫీలు, ఆఘమేఘాలమీద ఉరుకులు పరుగులమీద నిర్వహించిన `ఇంటింటి సర్వే\' ఫలితాలు, ఇప్పటివరకూ ఈ రాష్ర్టంలో వెలుగుచూసిన దాదాపు 330 మంది రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వ వైఖరి ఏమిటో- ఈ బడ్జెట్‌ ప్రతిపాదనల్లో ప్రస్థావనకు నోచుకోలేదు. మొత్తంగా నూతన రాష్ర్టంలో కొత్త ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మ కంగా మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌ అంతిమంగా ఎలాంటి ఫలితాలను సాధించదలుచుకున్నదో కనీసం పేరుకైనా ఈ బడ్జెట్‌ ప్రతిపాదనల్లో ప్రస్థావించలేదు. దీనినిబట్టి ఈ ప్రభుత్వం అనుసరించదలుచుకున్న భవిష్యత్తు వ్యూహాన్ని అంచనావేయడానికి మాత్రం ఈ బడ్జెట్‌ ప్రతిపాదనలు నేపథ్యంగా పనికివస్తాయని ఆశించవచ్చు.