Articles

విశ్వ విషాదానికి పదేళ్ళు


    హైదరాబాద్: భారత తూర్పు తీరాన్ని అతలాకుతలం చేసిన రాకాసి సునామి అలలకు రెండు లక్షల మందికి పైగా బలయ్యి నేటికి సరిగ్గా పదేళ్ళు. 2004 డిసెంబరు 26 న ఇండోనేషియా పశ్చిమ తీరంలో 9.3 తీవ్రతతో సముద్ర గర్భంలో భూకంపం సంభవించి భారీ అలలు ఇండోనేషియా, థాయ్‌లాండ్, శ్రీలంక, సోమాలియాలతో పాటు 14 దేశాల తీర ప్రాంతాలను ముంచెత్తి రెండు లక్షల ఇరవై వేల మంది దుర్మరణం పాలయ్యారు. ఒక్క ఇండోనేషియాలోనే లక్షా డెబ్బై వేల మంది చనిపోయారు. ఇండోనేషియాలోని బాండా ఆసేహ్ నగరంలో సునామీ మృతుల జ్ఞాపకార్థం దేశ జాతీయ గీతం ఆలపిస్తుండగా 20 ఎకరాల్లో స్మారక భవనం ప్రారంభించారు. దీనికి సమీపంలోనే సునామీ ఆవిర్భవించింది. ఇక్కడ కొన్ని వేల మందిని ఖననం చేశారు. సునామీ రక్కసి కోరలకు పదుల వేల సంఖ్యలో పసివాళ్ళు బలయ్యారు. క్రిస్‌మస్ వేడుకల్లో ఉన్న విదేశీ పర్యాటకులు సైతం మరణించటంతో విషాధం ప్రపంచమంతా పాకింది. ఇండియాలో 12 వేల మంది మరణించగా 5 వేల మంది తప్పిపోయారు. శ్రీలంకలో 30 వేల మంది మరణించారు.
    సునామీకి పదేళ్లు  పూర్తయిన సందర్భంగా తమిళనాడుతీరంలో ప్రజలు సముద్రుడికి పూజలు నిర్వహించారు. చెన్నై తీరంలోని మెరీనా బీచ్‌లో మహిళలు పాలబిందెలతో ఊరేగింపుగా వెళ్లి సముద్రుడికి పాలాభిషేకం చేశారు. ఇకపై ఉగ్రరూపం దాల్చొద్దని సముద్రాన్ని వేడుకున్నారు. సునామీ వచ్చి పదేళ్లయినా ఆనాటి ఘటన తాలూకు భయానక వాతావరణం ఇంకా కళ్ల ముందే కదలాడుతోందని తీరప్రాంత ప్రజలు తెలిపారు.