Articles

ఎస్సీలుగా రజకులు


భారత్‌లో అత్యంత ప్రాచీనమైన కుల వ్యవస్థలో ఇతిహాసాల కాలంలోనే ఉనికిలో ఉన్న చాకలి కులం ప్రధాన వృత్తి బట్టలు ఉతకడం. బట్టలు ఉతకడమే కాక, దేవుళ్ల ఉత్సవాల్లో సవారీలు మోయడం, దివిటీలు పట్టడం చేస్తారు. చాకళ్ళ గురించి ప్రభుత్వాలకు కూడా ఇంతకుమించి తెలియకపోవడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. బట్టలుతికేవారందరూ తెలుగు రాషా్ట్రలలో రజక/చాకలి/వన్నార్‌ కులస్తులుగా గుర్తించబడ్డారు. ఒకే కులంగా గుర్తించబడటంతో చాకలి కులంలో ఉండే అనేక ఉపకులాలు తీవ్రంగా నష్టపోయాయి. ఇంకా నష్టపోతూనే ఉన్నాయి. తెలుగు రాషా్ట్రలలోని ఎస్సీ జాబితాలో ప్రధాన కులాలనూ, వాటి ఉప కులాలనూ ప్రత్యేక కులాలుగా గుర్తించారు. ఒక మాల కులాన్ని ఉదాహరణగా తీసుకుంటే 11 ప్రధాన, ఉపకులాలను ప్రత్యేక కులాలుగా గుర్తించటాన్ని గమనించవచ్చు. బీసీ జాబితా చూస్తే చాకలి కులం విషయంలో ఈ ఉపకులాల ప్రస్తావనే ఉండదు. రజక/చాకలి/ వన్నార్‌ అనే పేరుతో చాకలి కులస్థులందరినీ ఒకే కులంగా గుర్తించి ఆదిమ జాతి/విముక్తి జాతి/ సంచార జాతి/ ఉప సంచార జాతుల కులాల గ్రూపు అయిన ‘ఏ’ గ్రూపులో చేర్చారు.
1909 ఎడ్గార్‌ త్రస్టన్‌ రాసి ‘ద క్యాస్ట్‌స్‌ అండ్‌ ట్రైబ్స్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా’ గ్రంథంలోని పేజీ నెం. 197 నుంచి 202 పేజీ వరకు దక్షిణ భారత దేశంలో చాకలి కులమూ, దాని ఉపకులాల ఆధారాలు లభ్యమౌతున్నాయి. చాకలి కులానికి 1. రెడ్డి భూమి, 2. మురికి నాటి, 3)పాకనాటి, 4) ఒడ్డి, 5)దేశ, 6) గొల్కొండ ఉపకులాలుగా ఉన్నాయి. రెడ్డి భూమి, మురికి నాటి, పాకనాటి చాకలి కులాలు నాడు అంటరాని కులాలుగా ఉ్న మాల, మాదిగ కులస్థుల బట్టలు ఉతికేవి కావు. అయితే దేశ, గోల్కొండ చాకలి కులాలు మాల, మాదిగ కులస్థుల బట్టలు ఉతికేవి. దేశ, గోల్కొండ చాకలి కులస్థులు మాల, మాదిగ కులస్తుల్లాగే శవాలను కూడా కాల్చేవారు. దేశ, గోల్కొండ కులస్తులు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలతోపాటు కొన్ని శూద్ర కులస్థుల శవాలను కాల్చేవారు. ఈ ఆచారం ఈ రోజుకీ ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాలలో కనిపిస్తుంది. పందులను సాకేవారు, పంది మాంసం తినేవారు. కానీ ఈ ఆచారం అలవాట్లు ప్రభుత్వం దృష్టికి మాత్రం రావడంలేదు. శవాలను కాల్చే వృత్తి అంటే అవి కేవలం మాల, మాదిగ కులస్థులకు మాత్రమే సబంధించిన వృత్తిగా భావించటం వలన రజకులు పాటిస్తున్న ఇలాంటివి వెలుగుచూడలేదు. 1985లో ఎన్‌.టి.రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్‌ఆర్‌ శంకరన్‌ ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన చొరవతో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలనే ప్రభుత్వాన్ని ఎన్టీఆర్‌ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించింది. ఆ నివేదికలో రజకుల సామాజిక పరిస్థితిని సరిగా చిత్రీకరించకుండా ప్రతిపాదించడం వల్ల ఆ ప్రయత్నం విఫలమైంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడక ముందు 1950లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో పొదర వన్నాన్‌ అనే చాకలి కులానికి ఎస్సీ హోదా ఇచ్చారు. కేరళలో కూడా పొదర వన్నాన్‌ అనే చాకలి కులానికి ఎస్సీ కేటగిరీలో చేర్చారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు చాకలి కులస్తులకు న్యాయం చేయాలి. 
 

\r\n

                                                          పి. జయరామ్‌
                                                          ప్రధాన కార్యదర్శి, మాచిదేవ సమితి

\r\n