Articles

బీసీ ఉద్యోగులకు క్రీమీలేయర్‌ ముప్పు


జస్టిస్‌ ఈశ్వరయ్య నేతృత్వంలోని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలోని సూచనలు, సిఫారసులు దిగ్ర్భాంతికరంగా ఉన్నాయి. బీసీలలోని సంపన్న శ్రేణి (క్రీమీలేయర్‌) వర్గాలను రిజర్వేషన్ల పరిధి నుంచి తొలగించుటకు వారి వార్షిక ఆదాయ పరిమితిని ఆరు నుంచి పదిన్నర లక్షలకు పెంచాలని ఆ నివేదిక సిఫారసు చేసింది. ఈ ఆదాయ పరిమితిలో ఉద్యోగుల జీతభత్యాలను కూడా కలిపి లెక్క కట్టి ఆదాయ పరిమితి దాటితే రిజర్వేషన్‌ నుంచి మినహాయించాలని ఆ నివేదిక సూచించింది.
గతంలో మండల్‌ కమిషన్‌ కేసులో దేశ సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు ‘ఇతర వెనుకబడిన వర్గాల’ (ఓబీసీ)లకు 27శాతం రిజర్వేషన్లు అమలుపరచాలని నిర్దేశించింది. అందులో భాగంగా, బీసీ రిజర్వేషన్లు కుల పరమైన రిజర్వేషన్లు కావు కనుక బీసీ కులాలలోని సామాజికంగా అభివృద్ధి చెందిన కుటుంబాలకు రిజర్వేషన్ల నుంచి తొలగించాలని సుప్రీం కోర్టు సూచించింది. వెనుకబడిన వర్గాలలో సంపన్నశ్రేణి (క్రీమీలేయర్‌) వారిని గుర్తించేందుకైౖ 1993లో కేంద్ర ప్రభుత్వం జస్టిస్‌ రాంనందన్‌ అధ్యక్షతన నిపుణుల కమిటీ నొకదాన్ని నియమించింది. ఆ కమిటీ నివేదిక ఆరు వర్గాలవారిని క్రీమీలేయర్‌గా గుర్తించింది. ఆ వర్గాలు: (అ) రాజ్యాంగబద్ధమైన పదవులలో ఉన్నవారి పిల్లలు; (ఆ) గ్రూప్‌-1 స్థాయి ఉద్యోగుల పిల్లలు; (ఇ) సాయుధ బలగాలలో కల్నల్‌, ఈ హోదాకు సమానస్థాయి అధికారుల పిల్లలు; (ఈ) ప్రైవేటురంగంలో పారిశ్రామికవేత్తలు, సినీరంగ ప్రముఖులు, ఇంజనీర్లు, డాక్టర్లు ఇత్యాది వర్గాల వారిలో వార్షికాదాయం ఆరు లక్షల రూపాయలకు పైబడిన వారి పిల్లలు; (ఉ) భూ కమతాల గరిష్ఠ పరిమితి ప్రకారం 85 శాతం భూమిని కల్గిన వారి పిల్లలు; (ఊ) వార్షికాకాదాయ పరిమితి ఆరు లక్షల రూపాయలకు పైబడిన వారందరి పిల్లలు. ఈ ఆరు వర్గాల వారూ బీసీల్లో సంపన్న శ్రేణి కిందకు వస్తారు. ఈ సంపన్న శ్రేణి వర్గాల గుర్తింపులో ఉద్యోగుల జీతభత్యాలు, వ్యవసాయంపై వచ్చే ఆదాయాన్ని మినహాయించారు. స్పష్టంగా చెప్పాలంటే ఇతర ఆదాయాలను మాత్రమే పరిగణనలోకి తీసుకొని క్రీమీలేయర్‌ స్థాయిని నిర్ధారించారు.
 జస్టిస్‌ రాంనందన్‌ కమిటీ చరిత్రాత్మక నివేదికలోని మరికొన్ని అంశాలను చూద్దాం. ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగి పోస్టును బట్టి సమాజంలో ఆ ఉద్యోగి హోదా నిర్ణయమవుతుంది. అంతేకాని ఆ ఉద్యోగి జీతభత్యాలతో కాదని ఆ నివేదిక పేర్కొంది. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రూప్‌-1లో నియమితులైన వారి సంతానాన్ని, గ్రూప్‌-2లో ఉద్యోగులుగా నియమితులైన దంపతుల పిల్లలను, గ్రూప్‌-2లో భార్య లేదా భర్త నియమించబడి గ్రూప్‌-1కి నలభై సంవత్సరాలలోపు పదోన్నతి పొందిన వారి పిల్లలను మాత్రమే సంపన్న శ్రేణిగా జస్టిస్‌ రాంనందన్‌ కమిటీ గుర్తించింది.
1993 అనంతరం కేంద్ర ప్రభుత్వం మూడు జాతీయ స్థాయి కమిషన్లను నియమించింది. ఈ కమిషన్లు వార్షిక ఆదాయాన్ని మొదట లక్ష నుంచి రెండున్నర లక్షలు, రెండున్నర లక్షల నుంచి నాలుగున్నర లక్షలు, నాలుగున్నర లక్షల నుంచి ఆరు లక్షలకు పెంచుతూ సిఫారసు చేశాయి. ఇందులో ఉద్యోగుల జీత భత్యాలు, వ్యవసాయ ఆదాయాన్ని మినహాయించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సిఫారసులను అమలు పరుస్తున్నాయి. బీసీలలో క్రీమీలేయర్‌కు సంబంధించి ఇప్పుడు అమలుపరుస్తున్న నిబంధనలను న్యాయస్థానాలు కూడా సమర్థించాయి.
ఇందుకు విరుద్ధంగా ప్రస్తుతం జస్టిస్‌ ఈశ్వరయ్య అధ్యక్షతన ఉన్న జాతీయ బీసీ కమిషన్‌ వార్షిక ఆదాయ పరిమితిని ఆరు లక్షల నుంచి పదిన్నర లక్షల రూపాయలకు పెంచింది. పైగా ఇందులో ఉద్యోగుల జీతభత్యాలను చేర్చింది. ఈ వార్షికాదాయ పరిమితి ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలోను, ప్రభుత్వ రంగ సంస్థలలోను పనిచేస్తున్న లక్షలాది బీసీ ఉద్యోగుల కుటుంబాలను రిజర్వేషన్ల నుంచి తొలగించాలని నిర్ణయించింది. ఇది చాలా దురదృష్టకరమైన విషయం.
జస్టిస్‌ ఈశ్వరయ్య కమిటీ తన నివేదికలో బీసీలకు ఉన్న 27 శాతం రిజర్వేషన్లు పూర్తిగా అమలుకావడం లేదని పేర్కొనడం గమనార్హం. ఈ వాస్తవాన్ని అంగీకరిస్తూనే రిజర్వేషన్‌ పరిధిలో ఉన్న బీసీ ఉద్యోగుల పిల్లలను రిజర్వేషన్‌ సదుపాయం నుంచి తొలగించాలని నిర్ణయించడం ఎంతవరకు సబబు? వెనుకబడిన తరగతుల వారి సంక్షేమం విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందా? సమాజహితులైన ఎవరికైనా ఇటువంటి అనుమానం వస్తే అది వారి తప్పు కాదు సుమా! పాలకులు చిత్త శుద్ధితో వ్యవహరించకపోతే వెనుకబడిన వర్గాలవారు అభ్యుదయాన్ని ఎలా సాధిస్తారు?
జస్టిస్‌ ఈశ్వరయ్య కమిటీ తన సిఫారసులతో రిజర్వేషన్ల లబ్ధిదారులుగా ఉన్న బీసీలను తగ్గిస్తూ మరి కొన్ని అగ్రకులాలను ఓబీసీ జాబితాలో చేర్చుటకు మార్గాన్ని సుగమం చేస్తున్నట్టుగా ఉంది. ఉదాహరణకు జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో భార్యా భర్తలిరువునూ ఉద్యోగం చేస్తున్నారే అనుకోండి. వారిరువురి వార్షికాదాయం, పెరిగిన జీతభత్యాల వలన పదిన్నర లక్షల రూపాయలకు తప్పక మించుతుంది. అంత మాత్రాన వారి పిల్లలను రిజర్వేషన్ల నుంచి తొలగిస్తారా? ఇది న్యాయమేనా? తల్లితండ్రులు మంచి ఆదాయం ఉన్నంత మాత్రాన వారు సామాజికంగా అభివృద్ధి చెందినట్లు ఎలా చెప్పగలరు? వారు తమ జీవితంలో ఎప్పటికైనా కలెక్టర్‌ హోదా పొందగలరా? పొందలేరు. కనుక జస్టిస్‌ ఈశ్వరయ్య నేతృత్వంలోని జాతీయ బీసీ కమిషన్‌ సమర్పించిన నివేదికను తక్షణమే రద్దు చేయాలి. లేదూ ఆ నివేదిక సిఫారసులను పునఃపరిశీలించాలి.
క్రీమీలేయర్‌ నిబంధనలను పూర్వ పద్ధతిలో అమలుపరచాలి. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా లక్షలాది బీసీ /ఓబీసీ ఉద్యోగులు ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారు. బీసీ కమిషన్లు నిజానికి రబ్బరు స్టాంపులని అనేక మంది మేధావులు, ప్రగతిశీల రాజకీయ నాయకులు విమర్శించడాన్ని నేను నా చిన్నతనం నుంచి వింటున్నాను. జస్టిస్‌ ఈశ్వరయ్య కమిషన్‌ నివేదికను చూసిన తరువాత ఆ విమర్శల్లో సంపూర్ణ సత్యముందని అర్థమయింది

\r\n

- కోడెపాక కుమారస్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం