Articles

బీసీలకు రాజ్యాంగ రక్షణ


భారత స్వాతంత్య్ర సమరం జరుగుతూండగానే మరొక పక్క సామాజిక న్యాయం కోసం, వివిధ సామాజిక వర్గాలకు గౌరవం కోసం మరొక సమరం సమాంతరంగా జరిగింది. స్వాతంత్య్రం రావడం కన్నా కూడా సామాజికన్యాయం, మనిషిని మనిషిగా గౌరవించే సమాజం అవసరం అని డాక్టర్‌ అంబేద్కర్‌ ఉద్యమించారు. కొందరు దీన్నివ్యతిరేకించి ముందు స్వాతంత్య్రం రానివ్వండి తర్వాత మన ప్రభుత్వంలో మన ఆంతరంగిక సమస్యలు అన్నింటిని చూసుకుందాం అని వాదించారు. అయితే అంబేద్కర్‌ ఇందుకు ఒప్పుకోకుండా తన సమరాన్ని సాగించిన ఫలితంగానే రాజ్యాంగంలో విడదీయరాని భాగంగా చట్టసభలలో దళితకులాలకు నిక్కచ్చిగా అన్ని రాష్ట్రాలలో కొన్ని సీట్లు వచ్చే వీలు కలిగింది. దళితకులాలు రాజ్యాధికారంలో పాలుపంచుకునే వీలు తథ్యంగా వచ్చే అవకాశం లభించింది. ఇది అంబేద్కర్‌కు ఉన్న దార్శనిక దృష్టి వల్లనే సాధ్యమయింది. అంబేద్కర్‌ చేసిన ఈ ఉద్యమం 1930దశకంలోనే మొదలైంది. సైమన్‌ కమిషన్‌ చేసిన ప్రతిపాదనల్ని సమీక్షించడానికి 1931లో లండన్‌లో రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌ జరిగింది. డిప్రె్‌సడ్‌ క్లాస్‌లకు రిజర్వేషన్‌ ఎలా ఇవ్వాలి అనే విషయంపైన ఈ చర్చ. ఈ సమావేశంలో అంబేద్కర్‌తో పాటు రాయబహదూర్‌ ఆర్‌.శ్రీనివాసన్‌ కూడా పాల్గొన్నారు. డిప్రె్‌సడ్‌ క్లాసె్‌సకు (ఆ కాలంలో హరిజనులను బ్రిటిష్‌వారు అలా పిలిచారు) రిజర్వేషన్‌ ఎందుకు ఎలా అవసరమో వారు వాదించారు. ఈ ప్రతిపాదనను అంగీకరించని గాంధీ కానీ, కాంగ్రెస్‌ పార్టీ తరఫున మరే ప్రతినిధిగానీ ఈ సమావేశానికి హాజరుకాలేదు. దీనితర్వాత ఎనిమిది నెలలకు తిరిగి మరో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. దానిలో అంబేద్కర్‌ పాల్గొని తన ఉద్యమ స్వరాన్ని వినిపించారు. శ్రీనివాసన్‌ కూడా హరిజనులకు రిజర్వేషన్‌ ఉండాలని గట్టిగా వాదించారు. గాంధీ మాత్రం హరిజనులకు ప్రత్యేక నియోజక వర్గాలు ఉండాలన్న ప్రతిపాదనను వ్యతిరేకించారు. కాంగ్రెస్‌ అలా తన స్వరం అప్పుడు వినిపించింది. గాంధీని ఒప్పించడానికి అంబేద్కర్‌ చాలా ప్రయత్నంచేసినట్లు కూడా చరిత్ర సాక్ష్యం చెబుతూ వుంది. దీనివల్ల హిందువులకు హరిజనులు దూరమవుతారని హిందూ సమాజం విడిపోతుందని గాంధీ వాదించారని చరిత్ర చెబుతూ ఉంది. ఆ తర్వాత జరిగిన చాలా పరిణామాల నేపథ్యంలో అంబేద్కర్‌ ఉద్యమఫలితంగా 1932లో అప్పటి బ్రిటిష్‌ ప్రధాని మాక్డోనాల్డ్‌ డిప్రె్‌సడ్‌ క్లాసె్‌సకు ప్రత్యక నియోజక వర్గాలు ప్రకటించాడు. ఆ తర్వాత ఈ ఉద్యమఫలితాలు రాజ్యాంగంలో భాగంగా మారాయి. దరిమిలా జరిగిన పూనా ఒప్పందం గాంధీపైన, కాంగ్రెస్‌పైన అంబేద్కర్‌ సాధించిన విజయంగా చెబుతారు.

\r\n

 చట్ట సభలలో దళిత కులాలకు రిజర్వేషన్‌ కోసం అంబేద్కర్‌ చేసిన ఆ సమరం చరిత్రాత్మకమైనది. ఇది భారతదేశంలో దళితుల చరిత్రనే మార్చివేసింది. దళితులకోసం ఇంత చేసిన అంబేద్కర్‌ అదే కాలంలో ఇటు గ్రామాలలో ఎన్నో అణగారిన కులాలు కూడా ఎంతో హీనంగా బతుకుతున్నాయనే వాస్తవాన్ని సరిగ్గా పట్టించుకోలేదు. ఆ కులాల వారు పేరుకు సవర్ణ హిందువులే అయినా అత్యంత దుర్భర జీవితం గడుపుతున్నారని, వారికి కూడా రిజర్వేషన్‌ ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుందనే విషయాన్ని పట్టించుకోలేదు. ఈ అణగారిన కులాల కోసం, అత్యంత హీనంగా బతికే యాచక కులాల కోసం, బీసీ కులాల కోసం మరొక అంబేద్కర్‌ యుద్ధం చేసి వుంటే వారికి కూడా చట్టసభలలో జనాభాదామాషా ప్రకారం రిజర్వేషన్‌ లభించిఉంటే భారత ప్రజాస్వామ్య చరిత్ర మరొకరకంగా ఉండేది. అన్ని రాష్ట్రాలలో బీసీల జనాభా నాడు నేడు 50నుంచి 70శాతం దాకా ఉంది. వారిలో కనీసం 40శాతం మంది అత్యంత హీనంగా బతికే అణగారిన యాచక కులాలు. కానీ రాజ్యాధికారం అగ్రకులాలు లేదా ఆధిపత్యకులాల దగ్గరే ఉంది. పేరుకు కొందరు బీసీలు మంత్రులైనా లేదా ఎక్కడో ఒకచోట ముఖ్యమంత్రులు అయినా అసలు రాజ్యాధికారం మాత్రం ఆధిపత్య కులాల వద్దే ఉంది. బ్రిటిష్‌ ఇండియాలో ఇదే జరిగింది. స్వతంత్ర భారతదేశంలో కూడా ఆదే జరిగింది. దళితకులాలకు రాజ్యాధికారం ఉన్నా వారు చట్ట సభలలో ఉన్న మంత్రులు అయినా వారు ఏదో ఒక పార్టీ సెల్లులలో బంధించబడే ఉన్నారు. అసలు రాజ్యాధికారం ఆధిపత్యకులాల వద్దనే ఉంది.అలాకాకుండా బీసీకులాలకు నాడే రాజ్యంగబద్ధమైన రిజర్వేషన్‌ అమలుజరిగి ఉంటే భారత ప్రజాస్వామ్య నిర్మాణం మరొక రకంగా ఉండేది. అణగారినకులాలకు రాజ్యాధికారం, దానిద్వారా నిజమైన సామాజికన్యాయం జరిగి ఉండేది. బీసీకులాలు అంటే నేడు విద్యావంతులకు సమాజంలో ఉన్నతస్థానంలో ఉన్న వారికి ముందున్న మూడు నాలుగు కులాలే కనిపిస్తాయి. ఈ మూడు నాలుగు కులాలను చట్టసభలలో సీట్లు ఇస్తే వారికి పదవులు ఇస్తే సామాజిక న్యాయం జరిగిపోయిందని అనుకుంటారు. కానీ తెలుగు మాట్లాడే రెండు రాష్ట్రాల ప్రజలలో 196 కులాలు ఉంటే అందులో సుమారు 120 కులాలు బీసీగా గుర్తింపు పొందిన అణగారిన కులాలున్నాయి. వీటిలో కొన్ని కులాల పేర్లు బయటి ప్రపంచానికి అంతగా తెలియవు కూడా. పైగా పలుకులాలు యాచన వృత్తిలో ఉన్నాయి. దళితకులాలలో రకరకాల వృత్తులలో ఉన్నవారున్నారు. కానీ వారిలో యాచన అనేది తక్కువ. కానీ బీసీ కులాలలో చాలా కులాలు ఇంకా యాచన మీదనే ఆధారపడినవి ఉన్నాయి. సేవకా వృత్తిలో ఉన్నకులాలను కొన్ని సందర్భాలలో అంటరాని వారుగా పరిగణించడం కూడా ఉంది. కొన్నికులాలవారు తమకు తమ కులం పేరుకు కూడా హీనత్వాన్ని ఆపాదిస్తూ ఉందని తమ కులాల పేర్లు మార్చుకున్నారు. వీర ముష్టి వారు తమ కులం పేరుని వీరభద్రీయులు అని పెట్టుకున్నారు. పిచ్చుకుంటి వారు తమ పేరును వంశరాజులు అని పెట్టుకున్నారు. పెక్కండ్ర వారు తాము కుమ్మరి కులానికి చెందిన వారమే అని చెప్పుకుంటున్నారు. రుంజల వారు తాము కమ్మరి అని లేదా విశ్వ కర్మ అనే పేర్లతో సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు. చాలా కులాల పేర్లు రెవెన్యూ అధికారులకు కూడా తెలియక ఈ కులం ఎక్కడుంది అని వారిని ఎదురు ప్రశ్నించి కులం సర్టిఫికెట్‌ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. గంగిరెద్దుల వారు, వారి ఇతర ఉపకులాలు పూర్తిగా యాచనపైనే ఆధారపడి ఉన్నాయి. అటు ప్రభు త్వం దృష్టి కానీ ఇటు సామాజికవేత్తల దృష్టి కానీ అంటరానితనం అనే అత్యంత సామాజిక హైన్యానికి గురైన దళితకులాల పైన ఉందేగాని, వారిగురించి మాట్లాడతారే కాని అత్యంత అణగారిన ఈ బీసీ కులాల గురించి పట్టించుకోరు. ఆ రోజున అంబేద్కర్‌ కూడా తన ధ్యాసని దళిత కులాలపైనే కేంద్రీకరించారు. చాకలి, వాల్మీకి, కొన్నిచోట్ల మంగలికులాల వారు, ఇంకా పలు బీసీ కులాలు తమకు ఎస్‌సీ హోదా కానీ ఎస్‌టీ హోదా కానీ కావాలని నేడు ఉద్యమాలు చేస్తున్నారు. దీనికి కారణం వారు అనుభవిస్తోన్న హీనమైన జీవనం. నిజానికి ఈ సబ్బండ బీసీ కులాల వారు చాలా దళిత కులాల వారికన్నా చాలా హీనమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఆధిపత్యకులాల శ్రమ దోపిడీకి, అణచివేతకు, హీన నిర్బంధానికి గురైనవారే. ఒక్క ఆంధ్రప్రదేశ్‌ (ఉమ్మడి) తీసుకున్నా 196 కులాలలో ఇప్పటిదాకా శాసనసభ గడపలో అడుగుపెట్టిన కులాలు 20 దాటలేదని గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో బీసీల కులాలు ఐదారుకన్నా ఎక్కువ ఉండవు. మిగతా 120 అణగారిన బీసీకులాలకు చట్ట సభలు అందని మాని పండ్లు లాగా ఇప్పటికీ మిగిలిపోయాయి. వీరందరికీ రాజ్యాధికారం లభించినప్పుడే మన దేశంలో సామాజికన్యాయం జరిగినట్లు భావించాలి. ప్రజాస్వామ్యం బతికి ఉన్నట్లు భావించాలి. అంత దాకా మన ప్రజాస్వామ్యం ఆధిపత్యకులాల కనుకొలుకుల్లో ఉన్నట్లే లెక్క. 

\r\n

ఈ రోజున సబ్బండ కులాలు అణగారిన బీసీ కులాలు ఉద్యమిస్తున్నాయి. రాజ్యాధికారం కావాలని గొంతెత్తిచాటుతున్నాయి. చట్టసభలలో పార్లమెంటులో బీసీకులాలకు రిజర్వేషన్‌ కావాలని ఉద్యమిస్తున్నాయి. చట్టసభలలో రిజర్వేషన్‌ ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుందనే యథార్థాన్ని అంబేద్కర్‌ గ్రహించి సాధించి విడిచిపెట్టిన యుద్ధనినాదాన్ని బీసీకులాలు ఇన్నాళ్ళకి గ్రహించి ఉద్యమించడానికి పూనుకోవడం చాలా ముదావహమైన విష యం. ఈ సామాజిక ఉద్యమ కాగడాని అంబేద్కర్‌ తరువాత ఇంతకాలానికి ఆర్‌.కృష్ణయ్య పట్టుకున్నారు. బీసీ ఉద్యమాల ఛాంపియన్‌ ఆర్‌.కృష్ణయ్య. మరొక ఉద్యమ నాయకుడు వకుళాభరణం కృష్ణమోహనరావు నేతృత్వంలో బీసీ ఉద్యమం నేడు ఢిల్లీ అధికార పీఠం తలుపు తడుతూ ఉంది. తమ ఉద్యమ నినాదాన్ని అణగారిన బీసీలు వినిపించబోతున్నారు.

\r\n

బీసీలు అంటే నేడు అధికారం పంచుకుంటున్న మూడు నాలుగు కులాలు మాత్రమే కాదు. నూటికిపైగా సబ్బండ అణగారిన కులాలు యాచక కులాలు ఉన్నాయని బీసీ నేతలు గుర్తించాలి. వారిని ఉద్యమంలో కలుపుకొని వారందరికీ సామాజిక న్యాయం కావాలని ఉద్యమించాలి. అంతేకాదు రాజ్యాధికారం కోసం చట్టసభలలో రిజర్వేషన్‌లో అణగారిన కులాలు అన్నింటికీ భాగస్వామ్యం ఉండేలా ఉద్యమం రూపుదిద్దుకోవాలి. పొందే రిజర్వేషన్‌లో అంతర్గత విభజన ఉండాలి. ఇలా జరిగిన దాకా ఇదే దామాషా సీ్త్రలకు కూడా లభించే దాకా అన్ని కులాల సీ్త్రలకు కూడా చట్టసభలలో సమానస్థానం దొరికేలా పథకాలకు రూపకల్పన జరగాలి. అప్పటిదాకా చట్టసభలలో సీ్త్రల రిజర్వేషన్‌ కూడా అమలు కావడానికి ఆస్కారం లేదు.

\r\n

అలాకాని పక్షంలో ఆధిపత్య కులాలకు చెందిన మహిళామణులే 30శాతం మేరకు చట్టసభలలో చేరే పరిస్థితి ఉంటుంది. అందుకే అణగారిన బీసీ కులాల రాజ్యాధికారం దాని రిజర్వేషన్‌తో ముడిపడే సీ్త్రల రిజర్వేషన్‌ కూడా ఉంటుందని, ఉండాలని అటు ఉద్యమనాయకులు ఇటు మేధావులు గుర్తించాలి. భారతదేశంలో ప్రజాస్వామ్యం నిలుపుకోవడానికి సరైన సామాజికన్యాయంతో కూడిన ప్రజాస్వామ్యాన్ని సాధించుకోవడానికి అణగారిన బీసీ సబ్బండ కులాలకు చట్ట సభలలో రిజర్వేషన్‌ కావాలి. అప్పుడే సామాజికన్యాయం అప్పుడే ప్రజాస్వామ్యం. ఈ సత్యాన్ని ఉద్యమ నాయకులు, బుద్ధిజీవులు గ్రహించి అడుగు ముందుకు వేయాలి.

\r\n

 

\r\n

- ప్రొఫెసర్‌ పులికొండ సుబ్బాచారి
ద్రావిడ విశ్వవిద్యాలయం