Articles

దళిత రాజ్యాధికార బాట వర్గీకరణే


వర్గీకరణే దళిత రాజ్యాధికార సౌధానికి సోపానమవుతుంది. పీడిత కులాలకిన్ని ఇబ్బందులు, అవమానాలు, కష్టాలు రావడానికి కారణం కులవ్యవస్థ. కుల నిర్మూలనకు దళిత రాజ్యాధికారమొక్కటే మార్గం. అత్యంత పీడితులైన దళితులు రాజ్యాధికారానికి వచ్చి కనీసం యాభై ఏండ్లు, డెబ్బై ఐదేండ్లు ఈ రాజ్యాన్నేలితే కులనిర్మూలన జరుగుతుంది.

\r\n

 

\r\n

ఎస్సీ వర్గీకరణ బిల్లు వచ్చే పార్లమెంటు సమావేశాల్లో చర్చకు పెట్టడానికి తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతు న్నాయి. ఇరవైరెండేళ్ళుగా వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్‌ నిర్విరామ పోరాటం చేస్తుంది. దాదాపు ఐదేళ్ళపాటు వర్గీకరణ అమలు జరిగినట్టేజరిగి మళ్ళీ వెనక్కిపోయింది. ఎస్సీ కులాల్లోని ఓ బలమైన గ్రూపుగా ఉన్న మాలలు సుప్రీంకోర్టుకు వెళ్ళడం వల్ల వర్గీకరణ అమలు ఆగిపోయింది. న్యాయం, ధర్మసమ్మత మైన ఈ వర్గీకరణను మాలలు అడ్డుకోవాల్సింది కాదు. మాలలు కోర్టుకెళ్ళినా దేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు వర్గీకరణ అమలును ఆపమని తీర్పునివ్వాల్సింది కాదు. నిజానికి సుప్రీంకోర్టు వర్గీకరణ అమలు కోసం బిల్లు తేవాల్సింది పార్లమెంటు తప్ప ఆయా రాష్ర్టాల అసెంబ్లీలు కావని స్పష్టంగా చెప్పింది.

\r\n

 

\r\n

                  కానీ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ పార్టీలు అప్పట్నుంచి వర్గీకరణ విషయంలో ఓట్ల రాజకీయాలాడుతున్నాయి. అటు కాంగ్రెస్‌, ఇటు తెలుగుదేశం అసెంబ్లీలో బిల్‌పాస్‌ చేసి పార్లమెం ట్‌కు పంపకుండా రెండు బలమైన ఎస్సీ గ్రూపులను ఓట్ల కోసం పావులుగా వినియోగించుకుంటున్నాయి. నిజానికి ఈ రెండు పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, కొన్ని సందర్భాలలో వర్గీకరణను సమర్థించినవే. కానీ చర్చ కోసం బిల్లును పార్లమెంటుకు పంపే విషయంలో మాలలు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వాళ్ళ ఓట్లు పోతాయని సంశయించారు. న్యాయసమ్మతమైన ఈ మానవీయ అంశాన్ని అంశంగా సమర్థించకుండా ఈ పార్టీలు, జాతీయపార్టీలు కూడా దీన్ని రాజకీయాంశం, ఓట్లు పొందే అంశమన్న దృష్టికోణంలో పావులు కదుపుతున్నాయి. తెలుగు సమాజం రెండు రాష్ర్టాలుగా ఏర్పడిన తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ అసెంబ్లీలో ఆమోదించి పార్లమెంట్‌కు పంపింది. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ మాత్రం ఇంతవరకూ ఆ పనీ చేయలేదు.

\r\n

 

\r\n

                  తెలంగాణలో మాదిగల సంఖ్య, చైతన్యం ఎక్కువయితే ఆంధ్రప్రదేశ్‌లో మాలల సంఖ్య, చైతన్యం ఎక్కువ. ఈ రాజకీయ ఓట్ల కారణాలను వదిలిపెట్టి కేసీఆర్‌, చంద్రబాబునాయుడు ఇద్దరూ తమ రాష్ట్రం (అవిభక్త ఆంధ్రప్రదేశ్‌) నుంచి వచ్చిన మానవీయ ఉద్యమాన్ని సమర్థిస్తూ, తాము చేసిన నిర్ణయంపై నిలబడి వర్గీకరణను పార్లమెంటులో ఆమోదింపజేయడానికి నైతిక, రాజకీయ, ఆర్థిక, హార్థిక మద్దతునిచ్చి తీరాలి. ఈ నెల 19 నుండి ఆగస్టు 12 వరకు జరిగే బిల్లు ఆమోద ధర్నాకు, దీక్షలకూ ఈ ప్రభుత్వాలు ప్రధానంగా మద్దతివ్వాలి, సహకరించాలి. తామే ముందుండి ఉద్యమాన్ని నడపాలి. మాల సోదర సోదరీమణులు, నాయకులు, మద్దతుదారులు ఈ అంశంలోని సామంజస్యతను గుర్తించి ఇది బిల్లు అవడానికి సహకరిస్తే అంతకంటే సత్కార్యం మరోటుండదు. రాజకీయ పార్టీల్లో కూడా ప్రధాన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌, బీఎస్పీ లాంటి పార్టీ, కొన్ని ప్రాంతీయ పార్టీలు వర్గీకరణను సమర్థిస్తున్నట్టుగా వార్తాపత్రికల్లో చూస్తున్నాం. ఈ వర్గీకరణ అమల్లోకి వస్తే ఈ దేశంలోని అత్యంత పీడితజాతి అయిన మాదిగ కులాలకు కొంతైనా న్యాయం జరుగుతుంది.

\r\n

 

\r\n

                  అంబేద్కర్‌ పుణ్యాన ఈ పీడిత జాతులకు రిజర్వేషన్‌లు అందివచ్చాయి. జనాభా ప్రాతిపదికన వీరికి 17శాతం రిజర్వేషన్లు రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి. ఇందులో వందలాది కులాలున్నాయి. ఇవన్నీ దళిత ఉపకులాలే. వీరెవరికీ గుడి, బడి మొహం కూడా చూసే అవకాశాలుండేవి కావు. ఈ దళితకులాల్లో మాదిగ, మాల గ్రూపులు ప్రధానమైనవి. రిజర్వేషన్‌ సౌకర్యం వల్ల దళితకులాలు చదువుకోగలిగారు. ఉద్యోగులు కాగలిగారు. రాజకీయాల్లోకి రాగలిగారు. కాని ఈ రిజర్వేషన్‌ సౌకర్యంతో అత్యధికంగా లాభపడ్డవారు మాలలు. స్వాతంత్య్రం వచ్చి ఆరున్నర దశాబ్దాలు దాటినా ఇంతవరకు బడి మొహం, అసెంబ్లీ, పార్లమెంట్‌ మొఖం చూడని మాదిగ కులాల వారు, ఉపకులాల వారు చాలామందున్నారు. దళితులనంతా షెడ్యూల్‌ క్యాస్ట్‌గా ఓ గ్రూపులో చేర్చడం వల్ల సహజంగానే మాదిగల కంటే, ఇతర గ్రూపుల కంటే చైతన్యవంతులైన మాలలు ఎక్కువ శాతం అనుభవిస్తున్నారు.

\r\n

 

\r\n

                  వాళ్ళ జనాభా ప్రకారం రావాల్సిన దానికంటే ఎన్నో రెట్లెక్కువ అనుభవిస్తున్నారు. దీంతో అత్యంత పీడితులైన మాదిగలు అలాగే వెనుకబడే ఉంటున్నారు. రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్లలో మా వాటా మాకు రావాలని, అందుకు దళిత కులాలను నాలుగు గ్రూపులుగా విభజించి ఎవరి జనాభా శాతం ప్రకారం వాళ్ళకివ్వాలని చేసిన పోరాటమే వర్గీకరణ పోరాటం. ఎమ్మార్పీఎస్‌ చేసిన, చేస్తున్న పోరాటం. ఇందులో ఎంత న్యాయముంది? ప్రజాస్వామ్యంలో ఎవరి వాటా వారు కోరడంలో ఎంతో సబబుంది? ఇది ధర్మసమ్మతం కూడా. దళిత కులాల్లో మాల కులాలు, మాదిగ ఉపకులాల కంటె చైతన్యవంతులుగా కొంచెం అభివద్ధి దశలో ఉండటానికి కారణాలు, మూలాలు కూడా ఈ కులవ్యవస్థలోనే ఉన్నాయి. మాదిగలు, మాలలు ఇద్దరూ అంటరానివారుగానే చూడబడినా మాదిగలకు పెద్ద ముట్టుడు, మాలలది చిన్న ముట్టుడనేవారు. మాదిగలను ఊరి చివర్లోనే ఉంచేవారు. మాలలు ఊరు చివర్లోనే ఉన్నా మాదిగల కంటె కొంచెం ముందు ఊరు పక్కన ఉండేవారు.

\r\n

 

\r\n

                  మాదిగలకు చెప్పులు కుట్టుడు, శవాలు పూడ్చుడు, బొందలు తవ్వుడు, కాట్నాలు పేర్చుడు, డప్పుగొట్టుడు, వెట్టి చేయడు, జంతు కళేబరాలను మోయడు, గొడ్లను కాయుడు లాంటి కఠినమైన సామాజికంగా తక్కువ స్థాయి ఐన, బ్రాహ్మణ భాషలో నీచమైనవిగా భావించబడే పనులు చేయమని శాసించారు. ఇవన్నీ దాదాపు బానిస పనులే. ఇవన్నీ చేస్తే అంటరానితం అనుభవించాలి. నీ బాంచెన్‌ కాల్మొక్తా అనుకుంటూనే దయతలచి పెడితే తినాలి లేకుంటే లేదు. ఎంత కఠినమైన, హీనమైన పనులు చేసినా కడుపు నిండని పరిస్థితులు. వీరిది కులసమాజంలో అత్యంత హీననీచస్థితి. మాలలూ అంటరానివారే అయినా సుంకర్లుగా ఉండటం, నీరటి కాళ్ళుగా చెరువు నీరు పారించడం, దొర పాలేర్లుగా ఉండటం లాంటి కొంచెం గౌరవప్రదమైన వృత్తుల్లో ఉండేవారు. దీంతో వీళ్ళలో కొంత చైతన్యం పెరిగింది. ముస్లిం రాజులు, ఆంగ్లేయులు ఈ దేశంలోకి వచ్చింతర్వాత ఇస్లాం, క్రైస్తవంలోకి మారి మాలలు ప్రార్థనాలయాల్లోకి ప్రవేశించే అర్హతను పొందారు. మాదిగల కంటె ముందే ఆ మతాల ద్వారా చదువుల్లోకి ప్రవేశించారు. ఇలా పెరిగిన చైతన్యంతో మాలలు రాజకీయంగానూ ఎదిగి రిజర్వేషన్‌ సౌకర్యాలను ఎక్కువగా ఉపయోగించుకున్నారు, ఉపయోగించుకుంటున్నారు. మాదిగలు ఎట్టి పరిస్థితిలోనూ తమకు రావాల్సిన జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల సౌకర్యాన్ని అనుభవించలేక పోతున్నారు. దేశంలోని అత్యంత పీడిత జాతి మాదిగలు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లలో తమ వాటా తమకు కావాలంటున్నారు.

\r\n

 

\r\n

                  ఇది తప్పెలా అవుతుంది? మాల మాదిగ సోదరులారా! పాలకులు ఈ సమస్యను తెగనీయరు. వర్గీకరణను అంగీకరించడం ద్వారా ఈ సమస్యను మీరే పరిష్కరించుకోవాలి.దళిత జాతుల్లోనే ఎవరివాటాను వారు అనుభవించే ప్రజాస్వామికత లేకుంటే అంబేద్కర్‌ జీవితాంతం బ్రాహ్మణీయ, మనువాద భావజాలంతో పోరాడి సాధించిన రిజర్వేషన్లకు అర్థమేంటి? వర్గీకరణే దళిత రాజ్యాధికార సౌధానికి సోపానమవుతుంది. పీడిత కులాలకిన్ని ఇబ్బందులు, అవమానాలు, కష్టాలు రావడానికి కారణం కులవ్యవస్థ. ఐదువేల ఏండ్ల్లుగా ఇది భారతదేశాన్ని పీల్చి పిప్పిచేస్తుంది. నిమ్న కులాల వారికిది శాపం. ఈ కుల నిర్మూలన జరగాల్సిందే. కుల నిర్మూలనకు దళిత రాజ్యాధికారమొక్కటే మార్గం. అత్యంత పీడితులైన దళితులు రాజ్యాధికారానికి వచ్చి కనీసం యాభై ఏండ్లు, డెబ్బై ఐదేండ్లు ఈ రాజ్యాన్నేలితే కులనిర్మూలన జరుగుతుంది. అప్పుడే సామాజిక, ఆర్థిక సమానత్వం సాధ్యమవుతుంది. భారత దేశంలోని చాలా సమస్యలకు ఇదే పరిష్కారం. 

\r\n

 

\r\n
కాలువ మల్లయ్య  
\r\n
98493 77578