Articles

కుల దొంతరలను కుదిపిన మండల్‌


మండల్‌ అనేమాట భారతదేశంలో చాలా శక్తిమంతమైనది. అంబేడ్కర్‌ తర్వాత నిచ్చెనమెట్ల కుల దొంతరలను కుదిపేసిన మహనీయుడు బిందేశ్వరీ ప్రసాద్‌ మండల్‌. వెనకబడ్డ జాతుల హితకారి. ఆధునిక సమాజంలో ‘మనుధర్మం’ కుళ్ళు వ్యవస్థను కుళ్ళబొడిసిన ఘనుడు. దేశ సంపదను సృష్టించే బహుజనులే దొడ్డవాళ్లన్నాడు. కుట్రలు కుతంత్రాలతో సాగుతున్న మోసాన్ని మండల్‌ పసిగట్టిండు. ‘చేసేది మేమైతే, మేసేది మీరా?’ అని ప్రశ్నించిండు. దేశ సంపదను దోచుకతినే పరాన్నజీవులను కట్టడి చేసిండు. వెనకబడ్డ జాతుల ఈతిబాధలుబాప ఓబీసీ రిజర్వేషన్లే భవిష్యత్తని ప్రతిపాదించిండు. భారతావనిలో వెనకబడ్డ జాతులకు భరోసా ఇచ్చిన అభినవ అంబేడ్కర్‌ మండల్‌. అపర ప్రజాస్వామ్య తాంత్రికుడు ఆ మహనీయుడు.

\r\n

               భారతదేశంలో కొనసాగుతున్న కుల వివక్ష మీద అధ్య యనం చేయనికి 1979 జనవరి 1న రెండో బ్యాక్‌వర్డ్‌ కమి షన్‌ ఏర్పాటైంది. అప్పటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్‌ ఐదుగురు సభ్యులతో కమిషన్‌ ఏర్పాటుచేసిండు. బి.పి. మండల్‌ అధ్యక్షతన ఏర్పడ్డ ఆ కమిషన్‌ ‘మండల్‌ కమిషన్‌’ అని పేరు పొందింది. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ఇతర వెనుకబడ్డ కులాలకు రిజర్వేషన్స్‌ ఇవ్వాలని 1980 డిసెంబర్‌ 31న మండల్‌ కమిషన సిఫార్సు చేసింది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి మండల్‌ కమిషన నివేదిక సమర్పించింది. దశాబ్దం పాటు ఇందిరా, రాజీవ్‌ గాంధీల ప్రభుత్వాలు ఆ నివేదికను ఉద్దేశపూర్వకంగానే పట్టించుకోలె. 1989లో జనతాదళ్‌ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అదీ బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధ్యక్షుడు కాన్షీరాం ప్రోద్బలంతో అప్పటి ఉపప్రధాని దేవీలాల్‌ వత్తిడిచేసిండు. దాంతో వి.పి.సింగ్‌కు ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టు అనివార్య పరిస్థితి ఏర్పడింది. 1990 ఆగస్టు 7న అప్పటి భారత ప్రధాని వి.పి.సింగ్‌ మండల్‌ కమిషన్‌ అమలుచేస్తున్నట్టు ప్రకటించిండు. విద్య, ఉద్యోగాల్లో ఇతర వెనుకబడ్డ కులాలకు మండల్‌ కమిషన్‌ ప్రకారం 27ు రిజర్వేషన్స్‌ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు బ్రాహ్మణీయ శక్తులు మండల్‌ కమిషనను వ్యతిరేకిస్తూ మందిర్‌ వివాదాన్ని ముందుకు తెచ్చిండ్లు. ‘మండల్‌ వర్సెస్‌ కమండల్‌’ దేశవ్యాప్తంగా పెద్ద యుద్ధమే జరిగింది.

\r\n

                     మండల్‌ కమిషన్‌ అమలుకు నోచుకొని అప్పుడే ఇరవై ఐదు ఏండ్లు గడిచినై. కానీ ఇప్పటికీ మండల్‌ కమిషన చేసిన 40 సిఫార్సుల్లో ఏ ఒక్కటీ పూర్తిగా అమలు అవుతలేదు. అగ్రకులాల నాయకత్వంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వాలకు మండల్‌ కమిషన్‌ అమలు పట్ల చిత్తశుద్ధి లేదు. అగ్రకులాల కుట్రలతో సుప్రీంకోర్టు జోక్యం వల్ల క్రీమీలేయర్‌ ముందుకు వచ్చింది. మరే ఇతర రిజర్వేషన్స్‌ వర్గాలవారికి లేని విధంగా ఓబీసీలకే క్రీమీలేయర్‌ అమలు అవుతాంది. ఎంత దారుణం ఇది? ఓబీసీలంటే ఎందుకీ వివక్ష?

\r\n

                  బిందేశ్వరీ ప్రసాద్‌ మండల్‌ 1918 ఆగస్టు 25న బిహార్‌ రాష్ట్రం మొరో ప్రాంతంలో యాదవ కులంలో జన్మించిండు. తండ్రి రాస్బీహారీలాల్‌ మండల్‌. రాస్బీహారీలాల్‌ పెద్ద జమీందార్‌, సంఘసంస్కర్త, స్వతంత్ర సమరయోధుడు.పువ్వు పుట్టగానే పరిమళించినట్లు బిందేశ్వరీ ప్రసాద్‌ బాల్యం నుంచే మంచి భావాలను, నాయకత్వ లక్షణాలను పుణికి పుచ్చుకున్నడు. 1952లో తొలిసారి బిహార్‌ శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికైండు. బిహార్‌ నుంచి రెండు సార్లు లోక్‌సభకూ ఎన్నికైండు. 1967 నుంచి 1970 వరకు, మళ్ళీ 1977 నుంచి 1979 వరకు పార్లమెంటు సభ్యుడిగా సేవలు అందించిండు. బిహార్‌ రాష్ర్టానికి ఆయన తొలి ఓబీసీ ముఖ్యమంత్రి. 1968 ఫిబ్రవరి1న మండల్‌ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిండు. రాజకీయ అస్థిరత్వం చాలా తీవ్రంగా ఉన్న రోజులు అవి. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ బయటి నుంచి మద్దతిచ్చి మండల్‌ను ముఖ్యమంత్రిని చేసింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ పార్టీ బిహార్‌ రాష్ట్రనాయకత్వం మీద విచారణకు ఆదేశించిండు. ఇందిరాగాంధీ మద్దతు విరమించుకుంటమని బెదిరించింది. అయినా ఆమె మాటనే ఖాతరు చేయలేదు. బిహార్‌ రాజకీయ చరిత్రలో నిర్భయంగా మాట్లాడుడు, నీతి, నిజాయితీ, నిబద్ధతగల అతి కొద్దిమంది నాయకుల్లో మండల్‌ ఒకరు అని ఆయన ప్రత్యర్థి కేకే మండల్‌ స్వయంగా కితాబిచ్చిండు. బిందేశ్వరీ ప్రసాద్‌ మండల్‌ 1982 ఏప్రిల్‌13న మరణించిండు.

\r\n

               బ్రాహ్మణీయ బానిస భావజాలం నుంచి బయట పడమని మహాత్మా జ్యోతిరావు ఫూలే బోధించిండు. నిచ్చెన మెట్ల కులతత్వ మనువాదాన్ని సమాధి చేయమని అంబేడ్కర్‌ ప్రబోధించిండు. దేశ సంపదను దోచుకతినే పరాన్నజీవులను కట్టడి చేసిండు బి.పి.మండల్‌. 

\r\n

బానిస భావజాలం నుంచి విముక్తి చేసుకోనికి బహుజనులు సంఘటితం అవుతున్న సందర్భంలోనే ఈ మహనీయుల విగ్రహాలు వాడవాడలా వెలుస్తున్నై. మానవ విలువల కోసం, మానవ హక్కుల కోసం అవిరామంగా పోరాడిన యోధులు. వాళ్ళను బహుజనులు ఆదర్శంగా తీసుకుంటున్నరు. స్ఫూర్తి పొందుతున్నరు. బలోపేతం అవుతున్నరు. ఆ వైనాన్ని వాడవాడలా వెలుస్తున్న మహనీయుల విగ్రహాలే చాటుతున్నై. వాళ్ళ ప్రేరణతో మెజారిటీ ప్రజలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, మహిళలు సంఘటితం అవుతున్నరు. తమ హక్కుల సాధన కోసం ఉద్యమబాట పడుతున్నరు.

\r\n

                  గట్లా అమరుల ఆశయ సాధన కోసం, చిత్తశుద్ధితో, నిబద్ధతతో లక్ష్య సాధనకోసం, సమసమాజ స్థాపనకోసం, ప్రజాస్వామ్య పాలన కోసం నిరంతరం జనాలను చైతన్యం చేసిన మహామహులు అనేకులు. కర్తవ్యంతో కలాన్ని కరవాలంగా చేసుకున్న కార్యదీక్షులూ కోకొల్లలు. గట్ల నేటికీ ఆత్మగౌరవం కోసం పోరాడుతున్న వీరులు ఎందరో. గా వీరులకు బాసటగా నిలిచిన వాళ్లూ బరిగీసి బరితెగించిన వాళ్లూ మరెందరో. తరతరాల రాచరికాన్ని, నయా దొరతనాన్ని ప్రశ్నిస్తూ బహుజన రాజ్యాధికారం కోసం నిరంతరం రణం చేస్తూనే ఉన్నరు. బహుజనులు ఇక సాహసం చూపాలె. మన మహనీయులే మనకు ఆదర్శం కావాలె. మన కలలు సాకారం చేసుకునేందుకు నిరంతరం శ్రమించాలె. కలిసొచ్చేటోళ్లతో కలిసి జతకట్టాలె. భుజం భుజం కలిపి కదం తొక్కాలె. బహుజనులను చైతన్యం చేయాలె. కోల్పోయిన హక్కుల సాధన కోసం సమరం సాగించాలే. సమసమాజం స్థాపించుకోవాలె.

\r\n

                  అందుకు ప్రేరణగా చరిత్ర గతిని మార్చిన మహనీయుల విగ్రహాలు మరెన్నో ఊరూరా, వాడవాడలా నెలకొల్పుకోవాలె. ఎందుకంటే ఇప్పుడు విగ్రహాలు కూడా విప్లవాలు సృష్టిస్తున్నై. తెలంగాణలో సామాజిక న్యాయం సాధించుకోవాలె. అప్పుడే సాహసంతో సహవాసం చేసిన బి.పి. మండల్‌ వంటి మహనీయులకు నిజమైన నివాళి. 

\r\n

-జాజుల శ్రీనివాస్‌గౌడ్‌, ప్రభంజన్‌ యాదవ్‌