Articles

ఎంబీసీలకు న్యాయం దక్కేనా?


అన్ని రంగాలలో అత్యంత వెనుకబడిన కులాలకు ఎంబీసీ మకుటంగా ప్రత్యేక గుర్తింపు ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిషన్‌ను నియమించి ఎంబీసీ కులాల గుర్తింపునకు చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వల్లే ఎంబీసీ గుర్తింపు సాధ్యపడుతుందని అత్యంత వెనుకబడిన కులాల ప్రజలు నమ్ముతున్నారు.

\r\n

ఎంబీసీలు అంటే అత్యంత వెనుకబడిన కులాలకు చెందినవారు. సమాజానికి వేలాది సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నవారు. బీసీ జనాభాలో 38 శాతం వీరే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు ఎంబీసీలకు అందడం లేదు. బీసీలకు విద్యా, ఉద్యోగ రంగాలలో కల్పిస్తున్న రిజర్వేషన్లు ఎంబీసీలకు దక్కడం లేదు. పంచాయితీరాజ్‌, మునిసిపల్‌ ఎన్నికలలో కల్పించిన రిజర్వేషన్లు నూటికో, కోటికో అన్నట్లు ఒక్క శాతం లోపే ఎంబీసీలకు పరిమితమవుతున్నాయి. అయితే బీసీలలో 8 నుంచి 10 దాకా ఉన్న ఆధిపత్య కులాలు మాత్రం ప్రభుత్వ సంక్షేమ పథకాలను, రిజర్వేషన్లను దక్కించుకుంటూ పైపైకి ఎదిగిపోతున్నాయి. ఈ కారణంగా వందకు పైగా ఉన్న ఎంబీసీ కులాలు దగాపడి అత్యంత వెనుకబాటుతనంలోకి జారిపోతున్నాయి. ఈ దారుణ పరిస్థితులనుంచి ఎంబీసీలు బయటపడి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిపుచ్చుకుని పురోగమించాలంటే బీసీ వర్గీకరణ తప్పక జరగాలి. ఎంబీసీ అనే ప్రత్యేక గుర్తింపును ప్రభుత్వం ఇవ్వాలి. ఇందుకోసం బీసీ కమిషన్‌ మాదిరిగానే ఒక ప్రత్యేక కమిషన్‌ను నియమించి ఎంబీసీ కులాలను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయాలి. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఈ దిశగా చర్యలు తీసుకోవాలి.

\r\n

ఎంబీసీలకు ప్రత్యేక గుర్తింపు విషయమై కొన్ని ముఖ్యమైన అంశాలు ఈ కింది విధంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన బీసీ జాబితాలో అయిదు గ్రూపులున్నాయి. గ్రూప్‌ ‘ఎ’లో 52 కులాలు, గ్రూప్‌ ‘బి’లో 28 కులాలు, గ్రూప్‌ ‘సి’లో 1 కులం, గ్రూప్‌ ‘డి’లో 47 కులాలు, గ్రూప్‌ ‘ఈ’లో 14 ముస్లిం కులాలను చేర్చారు. బీసీ జాబితాలోని ‘ఎ’, ‘బి’, ‘డి’ గ్రూప్‌లలో మాత్రమే వెనుకబడిన తరగతులలో కులాలు ఉన్నాయి. సమాజంలో ఆర్థికంగా ఎదిగిన కులాల నాయకులు తమ కులాలను పట్టుబట్టి బీసీ జాబితాలో చేర్పించడం వల్ల ఉనికిలో ఉన్న కులాలు నష్టపోతున్నాయి. అలాగే జాబితాలో ఆధిపత్య కులాలు ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలను దక్కించుకోవడం వల్ల అత్యంత వెనుకబడిన తరగతులకు చెందిన ప్రజలు సామాజికంగా, విద్య, ఉద్యోగపరంగా, ఆర్థికంగా ఎంబీసీలు రాజకీయంగా కూడా ఎంతో వెనుకబడి ఉన్నారు. 1952 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికలలో పార్లమెంట్‌, అసెంబ్లీ గడప తొక్కని ఎంబీసీ కులాలు దాదాపు వందకు పైగానే ఉన్నాయి. 1977లో ఒకరు, 1998లో మరొకరు మాత్రమే ఎంబీసీల తరపున పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహించారు. దీనినిబట్టి ఎంబీసీల పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో తెలుస్తుంది

\r\n

ప్రభుత్వం 2013–14 ఆర్థిక సంవత్సరంలో బీసీ స్కాలర్‌షిప్‌ల కోసం రూ. 90.88 కోట్లు మంజూరు చేశారు. అందులో రూ. 60.కోట్ల 30 లక్షలు కేవలం అయిదు కులాల (యాదవ, ముదిరాజ్‌, గౌడ, మున్నూరు కాపు, పద్మశాలి) విద్యార్థులు దక్కించుకోగా, మిగిలిన రూ. 29 కోట్లను వందకు పై ఉన్న కులాలు పొందాయి. ప్రీ మెట్రిక్‌ విద్యార్థులకు కేటాయించిన ప్రభుత్వ హాస్టళ్లలో, తెలంగాణలోని 10 జిల్లాల్లో 60 నుంచి 80 కులాలకు చెందిన విద్యార్థులకు అడ్మిషన్లు లభించలేదు. వివిధ పోటీ పరీక్షలలో శిక్షణ నిమిత్తం ఏర్పాటు చేసిన తెలంగాణ బీసీ స్టడీ సర్కిళ్లలో ఆధిపత్య కులాలకు చెందిన విద్యార్థులకే అత్యధిక సీట్లు దక్కుతున్నాయి

\r\n

ఉదాహరణకు నల్గొండ బీసీ స్టడీ సర్కిల్‌లో 2012–13, 2013–14లో గౌడ, యాదవ, మున్నూరు కాపు, ముదిరాజ్‌ కులాల విద్యార్థులు మాత్రమే అడ్మిషన్లు పొందారు. ఇక విదేశాలకు చదువుకోవడం కోసం వెళ్లే విద్యార్థులకు ‘మహాత్మా జ్యోతిరావు ఫూలే బీసీ విదేశీ విద్యానిధి’ కింద 99 మందిని ఎంపిక చేయడం హర్షణీయం. అయితే 24 కులాలకు మాత్రమే అవకాశం లభించడం బాధాకరమైన విషయం. ఇక ఉద్యోగ రంగంలో ఎంబీసీ కులాల నుంచి గ్రూప్‌–1, గ్రూప్‌–2 ఆఫీసర్లు ఒక్కరు కూడా లేరు. ఈ దారుణ పరిణామాలకు నిరక్షరాస్యతే కారణమని చెప్పక తప్పదు.

\r\n

నాడు ఫూలే చూపిన మార్గంలో నేడు కేసీఆర్‌ ప్రభుత్వం బీసీ విద్యార్థుల కోసం 119 రెసిడెన్షియల్‌ స్కూళ్ళను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇది గొప్ప నిర్ణయం. అయితే పైన పేర్కొన్న విధంగా బీసీలలోని ఆధిపత్య కులాలకే అధిక శాతం సీట్లు దక్కుతాయనడంలో సందేహం లేదు. కావున అత్యంత వెనుకబడిన కులాలకు చెందిన విద్యార్థులకు 76వేల సీట్లలో 45 వేల సీట్లు కేటాయించి న్యాయం చేయాలి. అన్ని రంగాలలో అత్యంత వెనుకబడిన కులాలకు ఎంబీసీ మకుటంగా ప్రత్యేక గుర్తింపు ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. వెనుకబడిన తరగతులు, అత్యంత వెనుకబడిన తరగతుల విభజన విషయమై ఇందిరా సహాని వర్సెస్‌ భారత ప్రభుత్వం మధ్య జరిగిన కేసులో (రిట్‌ పిటిషన్‌ సివిల్‌ నెం. 930 ఆఫ్‌ 1990 తేదీ) సుప్రీంకోర్టు 1992 నవంబరు 6న సంచలన తీర్పునిచ్చింది

\r\n

జస్టిస్‌ చిన్నపరెడ్డి అభిప్రాయం ప్రకారం సమాజం వెనుకబాటుతనం సమతుల్యంగా లేదు. అందువల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకబడిన తరగతులను విభజించవచ్చు. ‘భారత దేశంలో వెనుకబడిన కులాల వారికి సరైన గుర్తింపు లేదు. షెడ్యూల్డ్‌ తరగతులు, షెడ్యూల్డు తెగల వారిపై చూపుతున్న దయ, కరుణ అదే పరిణామంలో వెనుకబడిన తరగతుల వారికి కూడా విస్తరించవలసి వున్నది. వీరికి ఏ విధమైన రక్షణ రాజ్యాంగం కల్పించలేదు. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 34 ప్రకారం రాష్ట్రపతి నియమించిన ఓబీసీ కమిషన్ల సిఫారసుల ద్వారా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు అమలు చేయవచ్చు’ అని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ పేర్కొనడం జరిగింది.

\r\n

అంబేడ్కర్‌ చెప్పిన ప్రకారమే ఓబీసీల స్థితిగతులపై కేంద్ర ప్రభుత్వం 1953 జనవరి 29న కాకా సాహెబ్‌ కలేల్కర్‌ నేతృత్వంలో జాతీయ బీసీ కమిషన్‌ను నియమించింది. 1955లో కలేల్కర్‌ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. 1956లో కేంద్ర ప్రభుత్వం కలేల్కర్‌ నివేదికను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. అయితే తొమ్మిది ఏళ్ల తరువాత చర్చకు రావడం ఓబీసీలపై ప్రభుత్వాలకు ఉన్న ప్రేమ ఏమిటో తేలిపోతుంది. 2,399 ఓబీసీ కులాలు ఉండగా, అందులో 837 ఎంబీసీ కులాలు ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు. 1978లో మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్నప్పుడు బీసీ మండల్‌ ఆధ్వర్యంలో ద్వితీయ జాతీయ ఓబీసీ కమిషన్‌ ఏర్పాటైంది. 1980లో మండల్‌ నివేదిక సమర్పించగా వి.పి.సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఓబీసీలకు విద్య, ఉద్యోగ రంగాలలో 27 శాతం రిజర్వేషన్లు కల్పించి ఆ వర్గాల మన్ననలు పొందారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్‌ ఈశ్వరయ్య ఆధ్వర్యంలోని జాతీయ ఓబీసీ కమిషన్‌ ఓబీసీలను ‘గ్రూప్‌–ఎ, గ్రూప్‌–బి, గ్రూప్‌–సి’ పేరున మూడు గ్రూప్‌లుగా విభజించవచ్చని నివేదిక సిఫారసు చేసింది,. ఇదిలా ఉండగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అనంతరామన్‌ కమిషన్‌, మురళీధరరావు కమిషన్‌, దాళ్వా సుబ్రమణ్యం కమిషన్లు ఏర్పాటు జరిగాయి. అయితే ఈ కమిషన్ల వల్ల అత్యంత వెనుకబడిన కులాలైన ఎంబీసీలకు న్యాయం జరగలేదు

\r\n

కావున రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిషన్‌ను నియమించి ఎంబీసీ కులాల గుర్తింపునకు చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక్కరివల్లే ఎంబీసీ గుర్తింపు సాధ్యపడుతుందని అత్యంత వెనుకబడిన కులాల ప్రజలు నమ్ముతున్నారు. ముఖ్యమంత్రి చొరవ చూపి, ఎంబీసీ కులాల గుర్తింపు ప్రక్రియకు ఆదేశాలు జారీచేయాలి. ముఖ్యమంత్రి తీసుకునే ఈ నిర్ణయం వల్ల వందకు పైగా ఎంబీసీ కులాలకు బంగారు తెలంగాణలో ఉజ్వల భవిష్యత్‌ లభిస్తుంది. తద్వారా 38 శాతంగా ఉన్న ఎంబీసీ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరాధ్యులుగా, దిక్సూచిగా చరిత్రలో నిలిచిపోతారు.

\r\n

కె.సి. కాళప్ప

\r\n

అధ్యక్షులు, జాతీయ ఎంబీసీ సంక్షేమ సంఘం