Articles

ఎంబీసీలకు సంపూర్ణ న్యాయమేదీ?


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎంబీసీలు, ఎంబీసీ కులాలు ఉన్నట్లు గుర్తించడం హర్షణీయం. రాష్ట్ర ప్రభుత్వ జాబితాలోని గ్రూప్‌-ఎలోని 32 కులాలను మాత్రమే ఎంబీసీలుగా గుర్తించడం జరిగింది. కాకా కలేల్కర్‌, బి.పి. మండల్‌, అనంతరామన్‌ కమిషన్‌, జస్టిస్‌ ఈశ్వరయ్య కమిషన్‌లు సమర్పించిన నివేదికల్లో వందకు పైగా కులాలు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. పై కమిషన్‌ల నివేదికలను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించి మిగతా ఎంబీసీ కులాలకు న్యాయం చేయాలి.

\r\n

 ఎంబీసీ అనే పదం ఈమధ్య కాలంలో అత్యంత వెనుకబాటుతనానికి పర్యాయపదంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంబీసీలకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడాన్ని జాతీయ ఎంబీసీ సంక్షేమ సంఘం స్వాగతిస్తోంది. కొన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, కొందరు మేధావులు ఈ పదాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. ప్రశ్నలను సంధిస్తున్నారు. అందుకే ఎంబీసీల ప్రస్తావన స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 70 సంవత్సరాలుగా ఉనికిలో ఉందని తెలియచేయడమే ఈ వ్యాసం ఉద్దేశం. సమాజంలో బీసీలు ఎప్పటి నుంచి ఉన్నారో అప్పటి నుంచి ఎంబీసీలు ఉన్నారన్న మాట నగ్నసత్యం.

\r\n

 స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం అనే నాలుగు ప్రధాన సిద్ధాంతాలపై భారత రాజ్యాంగం రచింపబడింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 ప్రకారం దేశంలోని ఏ ఒక్క పౌరునికి సమానత్వం నిరాకరించరాదు. సమానత్వం అంటే అన్నిరంగాలలో అభివృద్ధి చెందిన పౌరులు. సమానత్వం పొందని వారంటే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నవారు. కావున సమానత్వం పొందిన వారితో సమానంగా సమానత్వం పొందని వారిని చూడరాదు. సమానత్వం పొందని వారిని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలి. అందుకే షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగల వారి అభివృద్ధికి రాజ్యాంగం రక్షణ కల్పించింది, చట్టాలు చేసింది. అయితే తరతరాలుగా వెనుకబడిన కులాల అభివృద్ధికి రాజ్యాంగంలో ఎటువంటి చట్టాలు చేయలేదు.

\r\n

 రాజ్యాంగ నిర్మాత అంతటివారే బీసీల గురించి ఆవేదన వ్యక్తం చేశారంటే ఆ కాలంలో వెనుకబడిన కులాల వారి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. రాజ్యాంగంలో ఆర్టికల్‌ 340ను పొందుపరచిన డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ భవిష్యత్‌లో బీసీ కమిషన్ల ఏర్పాటుకు, తద్వారా వెనుకబడిన తరగతుల అభివృద్ధికి, సమానత్వానికి మార్గం చూపి బీసీలకు ఉపకారం చేశారు.

\r\n

 భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత ప్రప్రథమ భారత ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల స్థితిగతులపై అధ్యయనం చేయడానికి నిర్ణయించింది. ప్రథమ రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్‌ రాజ్యాంగంలోని 340 ఆర్టికల్‌ ప్రకారం 1953 జనవరి 29న కాకా సాహెబ్‌ కలేల్కర్‌ అధ్యక్షతన 11 మంది సభ్యులతో మొదటి జాతీయ బీసీ కమిషన్‌ను నియమించారు. కలేల్కర్‌ కమిషన్‌ నివేదికను 1955 మార్చి 30న కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. సంవత్సరం తరువాత 1956లో అప్పటి కేంద్ర ప్రభుత్వం కాకా సాహెబ్‌ కలేల్కర్‌ కమిషన్‌ రిపోర్టును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అయితే ప్రథమ జాతీయ బీసీ కమిషన్‌ నివేదికపై తొమ్మిదేండ్ల తరువాత 1965లో పార్లమెంటులో చర్చకు రావడం, చర్చకు మాత్రమే పరిమితమై కేంద్ర ప్రభుత్వం దస్తావేజుల్లో ఉండటం శోచనీయం. అయితే కలేల్కర్‌ కమిషన్‌ నివేదిక చర్చకు రావడం వల్ల నివేదికలోని అనేక అంశాలు సభ్యసమాజానికి తెలిసి వచ్చాయి. ముఖ్యంగా బీసీలు, ఎంబీసీలు ఉన్నారనే నిజం వెలుగుచూసింది. కలేల్కర్‌ తన నివేదికలో దేశంలో 2399 బీసీ కులాలు ఉన్నాయని, ఇందులో 837 కులాలు అత్యంత (ఎంబీసీ) వెనుకబడి ఉన్నాయని తేల్చారు.

\r\n

 ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రాతినిధ్యం లేనివారు, విద్యకు దూరంగా ఉన్నవారు, పారిశ్రామికంగా అభివృద్ధి చెందని వారు, భూమిలేని నిరుపేదలు, వ్యవసాయ కూలీలు, సరైన సంపాదన లేనివాళ్ళు, ఇళ్ళు లేనివాళ్ళు, పూరిగుడిసెల్లో జీవించేవారు, యాచకవృత్తిలో ఉన్నవారు, అభివృద్ధి చెందిన కులాలతో పోల్చుకొని ఆత్మన్యూనతా భావంతో బ్రతికేవారు, రాజకీయాలలో ప్రాతినిధ్యం లేనివాళ్ళు మొదలగు అంశాల ఆధారంగా 837 కులాలు అత్యంత వెనుకబడి ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు.1978 డిసెంబర్‌ 28న మొరార్జీ దేశాయ్‌ ప్రధానిగా ఉన్న సమయంలో బి.పి. మండల్‌ అధ్యక్షతన రెండవ జాతీయ బీసీ కమిషన్‌ను అప్పటి భారత రాష్ట్రపతి ఏర్పాటుచేశారు. కమిషన్‌ ఛైర్మన్‌ బి.పి. మండల్‌ 1980 డిసెంబర్‌లో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. మండల్‌ నివేదికలో 54 శాతం ఓబీసీలున్నట్లు నిర్ధారించారు. 3,743 కులాలను బీసీలుగా గుర్తించారు.

\r\n

 తుది నివేదిక రూపొందించే సమయంలో మండల్‌ కమిషన్‌ సభ్యుడు ఎల్‌.ఆర్‌. నాయక్‌ (మాజీ దళిత పార్లమెంటు సభ్యుడు, మహారాష్ట్ర) చేసిన సూచనలను మండల్‌ కమిషన్‌ నివేదికలో భాగంగా చేర్చారు. ఇందులో ఓబీసీలను ఇంటర్‌మీడియట్‌ వెనుకబడిన తరగతులుగా, డిప్రెస్‌డ్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాసులుగా రాష్ట్రాల వారీగా రెండు రకాలుగా విభజించాలన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిధిలో డిప్రెస్‌డ్‌ వెనుకబడిన తరగతులలో 155 కులాలను చేర్చారు. మండల్‌ కమిషన్‌ నివేదికలోని అనుబంధం-–2లో ఈ కులాల పేర్లను పొందుపరిచారు.

\r\n

దీనినిబట్టి మండల్‌ కమిషన్‌ నివేదికలో కూడా ఎంబీసీల ప్రస్తావన ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఎల్‌.ఆర్‌. నాయక్‌ అభిప్రాయం ప్రకారం డిప్రెస్‌డ్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాసులను ఇంటర్‌మీడియట్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాసులతో చేర్చితే నష్టపోయేది రెండోవర్గం వారని అర్థం అవుతుంది. 1966లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 112 కులాలను ఇతర వెనుకబడిన తరగతులుగా గుర్తించింది. ఈ కులాలకు ప్రభుత్వ ఉద్యోగాలలో, వృత్తి విద్యాలయాల్లో రిజర్వేషన్లు కల్పించింది. ప్రభుత్వం వారు పైన కనపరచిన కులాలకు సంబంధించిన సామాజిక స్థితిగతులు విద్యాపరంగా వెనుకబాటుతనం గురించి తెలియచేయనందున హైకోర్టు రిజర్వేషన్లను కొట్టివేసింది. ఈ 112 కులాలకు సంబంధించి సామాజిక స్థితిగతులు, విద్యాపరంగా వెనుకబాటుతనం తెలియచేయాలని తీర్పునిచ్చింది.

\r\n

1968లో రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ మాజీ ప్రధాన న్యాయమూర్తి మనోహర్‌ పర్షాద్‌ అధ్యక్షతన బీసీ కమిషన్‌ను నియమించింది. జస్టిస్‌ మనోహర్‌ 1969లో ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు. దీంతో ప్రభుత్వం డి.కె.ఎం. అనంతరామన్‌ (రిటైర్డ్‌ ఐసిఎస్‌)ను ఛైర్మన్‌గా వెనుకబడిన తరగతుల సామాజిక, విద్యాపరంగా వెనుకబాటు తనం గుర్తించడానికి బీసీ కమిషన్‌ను నియమించింది. 1970 జూన్‌ 25న అనంతరామన్‌ నివేదిక సమర్పించారు. 93 కులాలు సామాజికంగా విద్యాపరంగా వెనుకబడి ఉన్నాయని వాటిని గ్రూప్‌–ఎ 7%, గ్రూప్‌–బి 10%, గ్రూప్‌–సి 1%, గ్రూప్‌–డి 7% అనే నాలుగు గ్రూపులుగా విభజించి 25 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫారసు చేశారు.

\r\n

 జాతీయ బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ వి.ఈశ్వరయ్య ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ)ను ఉపకులాలుగా విభజించాలని 2015 మార్చి 2న డివో నెం. ఎన్‌సీబీసీ/ ఎంఎస్‌/1/2015 లేఖ ద్వారా భారత ప్రభుత్వానికి నివేదిక పంపారు. అందులో ఓబీసీలను మూడు విభాగాలుగా విభజించి గ్రూప్‌–ఎ, గ్రూప్‌–బి, గ్రూప్‌–సి కేటగిరీలుగా విభజించారు.జస్టిస్‌ ఈశ్వరయ్య నివేదికలోని సిఫారసులను పరిశీలిస్తే ఓబీసీలలోనే వైరుధ్యాలున్నాయని, ఓబీసీలను మూడు కేటగిరీలుగా విభజిస్తే అత్యంత వెనుకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గత సంవత్సరం 8–6–2016 తేదీ జీవోఎంఎస్‌ నెం. 17 ద్వారా అత్యంత వెనుకబడిన వర్గాల అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసింది. జీవో నెం. 17లో చేర్చిన అనుబంధంలో 32 కులాలను (సంచార జాతులు, విముక్త జాతులు) ఎంబీసీలుగా గుర్తించి ఆయా కులాల పేర్లను పొందుపరిచారు. అలాగే ఈ నెల 8న జీవో ఆర్‌టి నెం. 2 ప్రకారం ఎంబీసీ కార్పొరేషన్‌ను కంపెనీల చట్టం–2013 కింద రిజిష్టర్‌ చేయాలని ఉత్తర్వులు జారీచేసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎంబీసీలు, ఎంబీసీ కులాలు ఉన్నట్లు గుర్తించడం హర్షణీయం. ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు.

\r\n

 అయితే రాష్ట్ర ప్రభుత్వ జాబితాలోని గ్రూప్‌–ఎలోని 32 కులాలను మాత్రమే ఎంబీసీలుగా గుర్తించడం జరిగింది. కాకా కలేల్కర్‌, బి.పి. మండల్‌, అనంతరామన్‌ కమిషన్‌, జస్టిస్‌ ఈశ్వరయ్య కమిషన్‌లు సమర్పించిన నివేదికల్లో వందకుపైగా కులాలు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. కావున పై కమిషన్‌ల నివేదికలను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సమగ్రంగా పరిశీలన చేసి మిగిలిన అనేక ఎంబీసీ కులాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడున్న బీసీ కులాల జాబితాలో ఉన్న ఎ, బీ, బీ, డీలను బీసీ కమిషన్‌ ద్వారా పునర్‌సమీక్షించి వారి స్థితిగతులపై శాస్త్రీయంగా సమగ్రమైన అధ్యయనం జరిపించి నివేదిక రూపొందించాలి. ఆ నివేదిక రాబోయే తరాల(బీసీ, ఎంబీసీ)కు సత్యప్రామాణికమైన భగవద్గీతలాగా, బైబిల్‌ మాదిరిగా, ఖురాన్‌లాగా ఉపయోగపడాలి. అలాగే ఎంబీసీల కోసం ప్రాథమిక విద్యనుంచి ఉన్నత చదువుల వరకు గురుకులాల్లో ఉచిత విద్య, రుణాలకు సంబంధించి బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా ఎంబీసీలకు 90శాతం సబ్సిడీతో రుణ సౌకర్యం కల్పించడం, విదేశీ విద్యలో ఎంబీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం, రాజకీయాల్లో నామినేటెడ్‌ పదవులు ఇవ్వడం వంటి న్యాయమైన డిమాండ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు సహృదయంతో పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకుంటే ఎంబీసీలకు గొప్ప మేలు చేసిన వారు అవుతారు.

\r\n

కె.సి. కాళప్ప, అధ్యక్షులు, జాతీయ ఎంబీసీ సంక్షేమ సంఘం