Articles

కేసీఆర్‌ చేతుల్లోనే ఎంబీసీలకు భద్రత


సమాజంలో బీసీలు ఎప్పటి నుంచి ఉన్నారో అప్పటి నుంచి ఎంబీసీలు ఉన్నారన్నమాట నగ్న సత్యం. బీసీ కులాల జాబితాలో ఉన్న ఎ,బి,సి,డి లను బీసీ కమిషన్ ద్వారా పునర్‌ సమీక్షించి వారి స్థితిగతులపై శాస్త్రీయంగా సమగ్ర అధ్యయనం జరపించి నివేదిక రూపొందించాలి. ఆ నివేదిక రాబోయే (బీసీ,ఎంబీసీ) తరాలకు సత్య ప్రామాణికమైన భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లాగా ఉపయోగపడాలి.

\r\n

 ఈ మధ్య కాలంలో ఎంబీసీ అనే పదం అత్యంత వెనుకబాటుతనానికి పర్యాయపదంగా మారింది. గొప్ప విజన్‌ ఉన్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఎంబీసీల గురించి పలుమార్లు శాసనసభలోనూ, శాసనసభ బయటా కూడా ప్రస్తావించడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సామాన్యమైన వ్యక్తికాదు. చట్టాల గురించి, శాసనాల గురించి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి. కాబట్టే ఎంబీసీలను గుర్తించడమే గాక ప్రత్యేక ఎంబీసీ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారని జాతీయ ఎంబీసీ సంక్షేమ సంఘం ప్రగాఢంగా విశ్వసిస్తోంది. కానీ కొన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, కొందరు మేధావులు ఈ పదాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. ప్రశ్నలను సంధిస్తున్నారు. అందుకే, ఎంబీసీల ప్రస్తావన స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి 70 సంవత్సరాలుగా ఉనికిలో ఉందని తెలియజేయడమే ఈ వ్యాసం ఉద్దేశం. సమాజంలో బీసీలు ఎప్పటి నుంచి ఉన్నారో అప్పటి నుంచి ఎంబీసీలు ఉన్నారన్నమాట నగ్న సత్యం.

\r\n

 భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత ప్రప్రథమ భారత ప్రధాని పండిట్ నెహ్రూ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల స్థితిగతులను అధ్యయనం చేయడానికి నిర్ణయించింది. ప్రథమ రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్‌ రాజ్యాంగంలోని అధికరణ 340 ప్రకారం 1953 జనవరి 29న కాకా సాహెబ్‌ కలేల్కర్‌ అధ్యక్షతన 11 మంది సభ్యులతో మొదటి జాతీయ బీసీ కమిషన్‌ను నియమించారు.కలేల్కర్‌ కమిషన్‌ నివేదికను 1955 మార్చి 30న కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. సంవత్సరం తరువాత 1956లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆ నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అయితే ప్రథమ జాతీయ బీసీకమిషన్‌ నివేదిక పై తొమ్మిదేండ్ల తరువాత 1965లో పార్లమెంటులో చర్చకు రావడం, చర్చకు మాత్రమే పరిమితమై కేంద్ర ప్రభుత్వ దస్తావేజుల్లో ఉండటం శోచనీయం. కలేల్కర్‌ కమిషన్‌ నివేదిక చర్చకు రావడం వల్ల నివేదికలోని అనేక అంశాలు సభ్య సమాజానికి తెలిసివచ్చాయి. ముఖ్యంగా బీసీలు, ఎంబీసీలు ఉన్నారనే నిజం వెలుగు చూసింది. కలేల్కర్‌ తన నివేదికలో 2399 బీసీ కులాలు ఉన్నాయని, ఇందులో 837 కులాలు అత్యంత (ఎంబిసి) వెనుకబడివున్నాయని తేల్చారు.

\r\n

 ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రాతినిధ్యం లేనివారు, విద్యకు దూరంగాఉన్నవారు, పారిశ్రామికంగా అభివృద్ధి చెందని వారు, భూమిలేని నిరుపేదలు, వ్యవసాయ కూలీలు, సరైన సంపాదన లేనివాళ్ళు, ఇళ్ళు లేనివాళ్ళు, పూరిగుడిశెల్లో జీవించేవారు, యాచక వృత్తిలో ఉన్నవారు, అభివృద్ధి చెందిన కులాలతో పోల్చుకుని ఆత్మన్యూనతా భావంతో బతికే వారు, రాజకీయాలలో ప్రాతినిధ్యం లేనివాళ్ళు మొదలగు అంశాల ఆధారంగా 837 కులాలు అత్యంత వెనుకబడిన ఉన్నట్లు కలేల్కర్‌ నివేదికలో పేర్కొన్నారు. కలేల్కర్‌ సమర్పించిన నివేదికలో (1953–55) ఆంధ్రరాష్ట్రంలో అత్యంత వెనుక బడిన కులాలు 36 వుండగా, హైదరాబాదు రాష్ట్రంలో 68 కులాలు ఉన్నట్లు నిర్థారించారు (అప్పటికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడలేదు).

\r\n

 1978 డిసెంబర్‌ 28న మొరార్జీ దేశాయ్‌ ప్రధానిగా వున్న సమయంలో బి.పి.మండల్‌ అధ్యక్షతన రెండవ జాతీయ బీసీ కమిషన్‌ను అప్పటి భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ఏర్పాటు చేశారు. కమిషన్‌ చైర్మన్‌ బి.పి.మండల్‌ 1980 డిసెంబర్‌లో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. మండల్‌ నివేదికలో 54శాతం ఓబీసీలు ఉన్నట్లు నిర్ధారించారు. 3,743 కులాలను బీసీలుగా గుర్తించారు. తుది నివేదిక రూపొందించే సమయంలో మండల్‌ కమిషన్‌ సభ్యుడు ఎల్‌.ఆర్‌.నాయక్‌ (మహారాష్ట్రకు చెందిన మాజీ దళిత ఎంపి) చేసిన సూచనలను మండల్‌ కమిషన్‌ నివేదికలో 7వ భాగంగా చేర్చడం జరిగింది. ఇందులో ఓబీసీలను ఇంటర్‌ మీడియట్‌ వెనుకబడిన తరగతులుగా, డిప్రెసెడ్ బ్యాక్‌ వర్డ్‌ క్లాసులుగా రాష్ట్రాల వారీగా రెండు రకాలుగా విభజించాలన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిధిలో డిప్రెసెడ్ వెనుకబడిన తరగతులలో 155 కులాలను చేర్చారు. నివేదిక అనుబంధం–2లో ఈ కులాలపేర్లను పొందుపరిచారు. దీనిని బట్టి మండల్‌ కమిషన్‌ నివేదికలో కూడా ఎంబీసీల ప్రస్తావన ఉన్నట్లు కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఎల్‌ ఆర్‌ నాయక్‌ అభిప్రాయం ప్రకారం డిప్రెసెడ్ బ్యాక్‌వర్డ్‌ క్లాసులను ఇంటర్మీడియెట్‌ బ్యాక్‌ వర్డ్‌ క్లాసులతో చేర్చితే నష్టపోయేది రెండోవర్గం వారని అర్థమవుతుంది. నాయక్‌ అభిప్రాయంతో ప్రముఖ దళిత మేధావి చంద్ర భాను ప్రసాద్‌, సామాజిక శాస్త్రవేత్తలు యోగేంద్ర యాదవ్‌, సతీశ్‌ దేశ్‌పాండేలు ఏకీభవించారు.

\r\n

 1966లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 112 కులాలను ఇతర వెనుకబడిన తరగతులుగా గుర్తించింది. ఈ కులాలకు ప్రభుత్వ ఉద్యోగాలలో, వృత్తి విద్యాలయాలలో రిజర్వేషన్లు కల్పించింది. అయితే ఈ కులాలకు సంబంధించిన సామాజిక స్థితిగతులు, విద్యాపరంగా వెనుకబాటుతనం గురించి తెలియచేయనందున హైకోర్టు ఆ రిజర్వేషన్లను కొట్టివేసింది. ఈ 112 కులాలకు సంబంధించి సామాజిక స్థితిగతులు, విద్యాపరంగా వెనుకబాటుతనం గురించి తెలియజేయాలని తీర్పునిచ్చింది. 1968లో రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ మాజీ ప్రధాన న్యాయమూర్తి మనోహర్‌ పర్‌షాద్‌ అధ్యక్షతన బీసీకమిషన్‌ను నియమించింది. జస్టిస్‌ మనోహర్‌ 1969లో చైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు. దీంతో రిటైర్డ్‌ ఐసిఎస్ అనంతరామన్‌ చైర్మన్‌గా బీసీకమిషన్‌ను నియమించింది.

\r\n

 1970 జూన్‌ 25న అనంతరామన్‌ నివేదిక సమర్పించారు. 93 కులాలను విద్యా పరంగా, సామాజికంగా వెనుకబడివున్నాయని వాటిని గ్రూప్‌–ఎ–7 శాతం, గ్రూప్‌ బి–10 శాతం, గ్రూప్ సి– 1 శాతం, గ్రూప్‌ డి– 7 శాతం అనే నాలుగు గ్రూపులుగా విభజించి 25 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫారసు చేశారు. నాలుగు గ్రూపులుగా విభజించిన 93 కులాల్లో డినోటిఫైడ్‌కు చెందిన 29 కులాల ను బీసీజాబితాలో చేర్చారు. బి, డి గ్రూప్స్‌లో కొన్ని అత్యంత వెనుకబడిన కులాలు వున్నాయని గమనించాలి. దీనినిబట్టి పరిశీలిస్తే అత్యంత వెనుకబాటు కులాలను బీసీ–ఎ జాబితాలో చేర్చడం జరిగిందని గమనించాలి. మొత్తంగా పరిశీలనలోకి తీసుకుంటే కాకా కలేల్కర్‌ కమిషన్, మండల్‌ కమిషన్‌, అనంతరామన్‌ (రాష్ట్ర) కమిషన్‌ నివేదికల్లో పేర్కొన్న కులాలను పరిశీలిస్తే కొన్ని కులాలు అత్యంత వెనుకబడినవిగానే పరిగణనలోకి వస్తాయి. కాలేల్కర్‌, మండల్, అనంతరామన్‌ కమిషన్ల నివేదికల్లో పేర్కొన్న అత్యంత వెనుకబడిన కులాలు అన్నీ తెలంగాణ ప్రపభుత్వం గుర్తించిన బీసీ జాబితాలో ఉన్నవేనని గ్రహించాలి. జాతీయ బీసీ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ వి. ఈశ్వరయ్య ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీల)ను ఉపకులాలుగా విభజించాలని 2015 మార్చి 2న భారత ప్రభుత్వానికి నివేదిక పంపారు. అందులో ఓబీసీలను మూడు విభాగాలుగా విభజించి గ్రూప్‌– ఎ, గ్రూప్‌– బి, గ్రూప్‌– సి కేటగిరీలుగా విభజించారు. ‘ఎ’లో ఎక్స్‌ట్రీమ్లీ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ను, ‘బి’లో మోర్‌ బ్యాక్‌ వర్డ్‌ క్లాసెస్‌ను, ‘సి’లో బీసీలను (వెనుకబడిన తరగతులు)చేర్చాలని ఆయన సూచించారు. జస్టిస్‌ ఈశ్వరయ్య నివేదికలోని సిఫారసులను పరిశీలిస్తే ఓబీసీలలోనే వైరుధ్యాలున్నాయని, ఓబీసీలను మూడు కేటగిరీలుగా విభజిస్తే అత్యంత వెనుకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడినట్లు స్పష్టమవుతున్నది.

\r\n

 ముఖ్యమంత్రి కేసీఆర్‌ చట్టాలు, న్యాయశాస్త్రాలు తెలిసిన వ్యక్తి. సామాజిక శాస్త్రవేత్త కూడా. ఆయన ఎంబీసీ పదాన్ని శాసనసభావేదికపై ప్రస్తావించక ముందే చాలా కసరత్తు చేశారు. ‘ఎంబీసీలు వారి స్థితిగతుల’ పై జాతీయ ఎంబీసీ సంక్షేమసంఘం అధ్యక్ష హోదాలో నేను, శాసనసభాపతి, ఆర్థిక శాఖామాత్యులతో పలు దఫాలుగా చర్చించడం జరిగింది. చర్చల సారాంశం పరిశీలించిన తర్వాతనే ఎంబీసీలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమగ్ర నివేదిక రూపొందింపజేశారు. అలాగే ఎంబీసీలు ఉనికిలో ఉన్న పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో మన రాష్ట్రం నుంచి అధికారులను పంపించి అధ్యయనం చేయించారు. ఎంబీసీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారు. 1000 కోట్లు కేటాయించారు.

\r\n

 ఎంబీసీల గురించి నివేదికను సమర్పించడానికి ఆరునెలల గడువు విధించారు. ఆషామాషీగా కాకుండా ఎంతో కసరత్తు చేసిన తర్వాతనే ముఖ్యమంత్రికే సీఆర్‌ ఎంబీసీ కార్పొరేషన్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారు. పై విషయాలను ఎంబీసీ సిద్ధాంతకర్తలమనే వారు సహృదయంతో అర్థం చేసుకుని ఎంబీసీల అభ్యున్నతికి తమ వంతు కృషి చేయగలరు.

\r\n

 ఇక ఇప్పుడున్న బీసీ కులాల జాబితాలో ఉన్న ఎ,బి,సి,డి లను బీసీ కమిషన్ ద్వారా పునర్‌ సమీక్షించి వారి స్థితిగతులపై శాస్త్రీయంగా సమగ్ర అధ్యయనం జరపించి నివేదిక రూపొందించాలి. ఆ నివేదిక రాబోయే తరాల (బీసీ, ఎంబీసీ) కు సత్య ప్రామాణికమైన భగవద్గీతలాగా, బైబిల్ మాదిరిగా, ఖురాన్‌లాగా ఉపయోగపడాలి. అలాగే, ఎంబీసీల కోసం ప్రాథమిక విద్యనుంచి ఉన్నత చదువుల వరకు గురుకులాల్లో ఉచిత విద్య, రుణాలకు సంబంధించి బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా ఎంబీసీలకు 90 శాతం సబ్సిడీతో రుణ సౌకర్యం కల్పించడం, విదేశీ విద్యలో ఎంబీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం, రాజకీయాల్లో నామినేటెడ్‌ పదవులు ఇవ్వడం వంటి హామీలను ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే. ఇటీవల జరిగిన ప్లీనరీ సమావేశాల్లో కూడ ఎంబీసీ కులాలు 93 ఉన్నాయని ఆ కులాలన్నింటికీ న్యాయం చేస్తామని ప్రకటించారు. ఇవన్నీ అత్యంత వేగంగా అమలు జరిగితే తరతరాలుగా అణగారిన ఎంబీసీల కల సాకారమవుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల్లోనే ఎంబీసీలకు భద్రత ఉంటుందని ఎంబీసీ వర్గాలు నమ్ముతున్నాయి. ముఖ్యమంత్రి నిర్మిస్తున్న బంగారు తెలంగాణలో తమకు బంగారు భవిష్యత్తు ఉంటుందని ఎంబీసీ కులాల ప్రజలు ఆశిస్తున్నారు. కేసీఆర్‌ తీసుకునే ఈ నిర్ణయం ఎంబీసీ కులాలకు బంగారు తెలంగాణలో ఉజ్వల భవిష్యత్తు లభిస్తుంది. తద్వారా 38 శాతంగా ఉన్న ఎంబీసీ ప్రజలకు ముఖ్యమంత్రి కే సీఆర్‌ ఆరాధ్యులుగా, దిక్సూచిగా చరిత్రలో నిలిచిపోతారు.

\r\n

-కె.సి. కాళప్ప, సంగెం సూర్యారావు,

\r\n

జాతీయ ఎంబీసీ సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు