Articles

బీసీల ఆకాంక్షలే కొలమానం


బలహీన వర్గాల మొహాలు వెలిగినపుడే, వారి కళ్ళల్లో ఆనందం వెల్లివిరిసినప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందుకు సార్థకత ఉంటుందని తెలంగాణ రాష్ట్ర తొలి శాసన సభ సమావేశంలో సీఎం కేసీఆర్‌ గుండె లోతుల్లోంచి మాట్లాడిన మాటలే తెలంగాణ బీసీ కమిషన్‌ కార్యాచరణను నడిపిస్తున్నాయి.
 
దశాబ్దాల సమైక్యాంధ్రలో సమిధలుగా మారిన బీసీ కులాల ప్రజా జీవనాన్ని అధ్యయనం చేయడానికి, విద్యా ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్ల పెంపుదలతో పాటు బీసీ, ఎంబీసీ, సంచార జాతులపై విడిగా ప్రత్యేక దృష్టితో అధ్యయనం జరపాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని దాటకుండా తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్‌ లోతైన పరిశోధన దృక్పథంతో అడుగులేస్తున్నది. సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా శ్రమిస్తున్న ముఖ్య మంత్రి కేసీఆర్‌ బీసీ కమిషన్‌తో మొదటి అధికారిక సుధీర్ఘ సమావేశంలో వెనుకబడిన వర్గాలపై బీసీ కమీషన్‌ ద్వారా తెలంగాణ ప్రభుత్వం జరుపతలపెట్టిన ఈ అధ్యయనం భవిష్యత్‌ తరాలకు ప్రామాణికంగా నిలబడాలి. బీసీల ఆకాంక్షలే కొలమానాలుగా హైదరాబాద్‌ రాష్ట్రంలోని బీసీ కులాల స్థితి, సమైక్యాంధ్రలో వెనుకబడిన తరగతుల సామాజిక, విద్యా, ఆర్థిక పరిణామాలతో పాటు రాజకీయ భాగస్వామ్యాన్ని కూడా అధ్యయనం చేస్తున్నది.
1956 నవంబర్‌ 1కి పూర్వం హైదరాబాద్‌ రాష్ట్రంలో దాదాపు 60కి పైగా బీసీ కులాల జాబితా, ఆంధ్ర రాష్ట్రంలో 86 ఆంధ్రా కులాలతో బీసీ జాబితా ఉన్నది. ఈ రెండు కలవడం వల్ల మొత్తం 146 కులాలకు చేరింది.
 
1963 జూన్‌ 21న ఆనాటి ఏపీ ప్రభుత్వం ఎలాంటి శాస్త్రీయ విధానాలు పాటించకుండానే జి.వో. ఎం.ఎస్‌. నెంబర్‌ 1861 ద్వారా ప్రభుత్వ వైద్య, వృత్తి కళాశాలల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అనేక మంది ఈ జి.వో. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 15, 29(2) లకు పూర్తిగా విరుద్ధమని హైకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించారు.
 
విచారణానంతరం బాలజీ, సుఖ్‌దేవ్‌ మరియు ఇతరులు వర్సెస్‌ ఆంధ్రప్రదేశ్‌ కేసులలో న్యాయస్థానాల తీర్పులకు ఈ జి.వో. వ్యతిరేకమని నిర్ధారిస్తూ 1861 జి.వో.ను కొట్టేసింది. దీంతో పాటు వెనుకబాటుతనం నిర్ధారణకు ప్రభుత్వం ఎంచుకున్న కొలమానం కేవలం ఆర్థికపరమైనది మాత్రమేనని, ఆ కొలమానం వ్యక్తులకు మాత్రమే వర్తిస్తుంది తప్ప మొత్తం కులానికి కాదని కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆనాటి ఏపీ ప్రభుత్వం 1964 ఫిబ్రవరి 3న జి.వో.ఎం.ఎస్‌. 301 ద్వారా 1964 ఏప్రిల్‌ 1 నుంచి రాష్ట్రంలో బీసీ కులాల జాబితాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మరో తప్పటడుగు వేసి బీసీ కులాల జాబితా తయారికి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. లా–సెక్రెటరీ, సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌లతో సంప్రదించిన మంత్రివర్గ ఉపసంఘం పేదరికం, నివాసం, విద్యా తదితర ప్రమాణాల ఆధారంగా 1966 జులై 4న 112 కులాలతో బీసీ జాబితాను నిర్ధారించడంతో అదే సంవత్సరం జులై 29న జి.వో.ఎం.ఎస్‌. 188 ద్వారా రాష్ట్ర ప్రభుత్వ బీసీ కులాల జాబితాను ప్రకటించింది. కమిషన్‌ను నియమించకుండా, శాస్త్రీయత లేకుండా ప్రభుత్వం చేసిన ఈ చర్యను తప్పుపట్టిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం 188 జి.వో.ను మళ్ళీ చెల్లదని తీర్పు నిచ్చింది. ఇదే తీర్పును 1968 మార్చి 27న ఏపీ స్టేట్‌ వర్సెస్‌ పి.సాగర్‌ కేసులో సుప్రీం కోర్టు కూడా సమర్థించింది.
 
దీంతో 1952 కమీషన్స్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ యాక్ట్‌ క్రింద ఏపీ మొదటి బీసీ కమిషన్‌ను ఏప్రిల్‌ 12, 1968న ఆనాటి ప్రభుత్వం ప్రకటించింది. దీనికి చైర్మన్‌గా తొలుత బాధ్యతలు చేపట్టిన హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మనోహర్‌ పరిహార్‌ 1969 లో రాజీనామా చేయడంతో శ్రీ కె.యన్‌. అనంతరామన్‌, చైర్మన్‌గా 1970 జూన్‌ 20న కమిషన్‌ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. మాజీ శాసన సభ్యులు సి.హెచ్‌.రాజేశ్వరరావు, టి.నాగేశ్వరరావు, శాసన మండలి సభ్యులు లింగయ్య, నాగభూషణ తదితరుల అనుభవజ్ఞులతో కూడిన ఈ కమిషన్‌ అనేక సిఫార్సులను ప్రభుత్వానికి సూచించింది. ఎ, బి, సి, డి వర్గీకరణతో పాటు విద్యా, ఉద్యోగ రంగాలలో పలు చర్యలను సూచించింది.
 
అనంతరం 1982లో శ్రీ మురళీధర్‌ రావు కమిషన్‌ 25% రిజర్వేషన్లను 44%కి పెంచడంతో పాటు బీసీలకు చట్టసభలలో సహితం రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసింది. బీసీల సమస్యల పరిష్కారానికి రాజ్యాంగంలోని అధికరణలు 15(4), 16(4)లను వెనుకబడిన వర్గాల జీవితంలో అనుభవంలోకి తేవడానికి అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటుతో పాటు అనేక సిఫార్సులు చేసింది. కాని ఆనాటి ప్రభుత్వాలు కమిషన్‌ల సిఫార్సులను అమలు చేయడంలో విఫలం చెందాయన్నది చారిత్రక సత్యం. అనంత రామన్‌ కమిషన్‌ నుంచి మొదలు జస్టిస్‌ దాళ్వ సుబ్రహ్మణ్యం కమిషన్‌ దాకా గత కమిషన్లు అనుసరించిన విధానాలను ప్రత్యేక శ్రద్ధతో తెలంగాణ తొలి బీసీ కమిషన్‌ పరిశీలిస్తున్నది. దేశ వ్యాప్తంగా కాకా సాహెబ్‌ కలేల్కర్‌ కమిషన్‌, మండల్‌ కమిషన్‌, తమిళనాడుకు చెందిన అంబరీష్‌ కమిషన్‌, జస్టిస్‌ తిరు జనార్ధనమ్‌ కమీషన్‌, కర్ణాటక, బీహార్‌ తదితర బీసీ కమిషన్‌లు ఆయా రాష్ట్రాలలో వెనుకబడిన తరగతులను గుర్తించడానికి, వర్గీకరించడానికి అనుసరించిన కొలమానాలను, ప్రామాణికతను సమీక్షిస్తున్నది.
 
అందులో భాగంగా గత ఏడాది ఏప్రిల్‌లో దాదాపు నెల రోజుల పాటు కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా హెచ్‌. కాంత రాజా ఆధ్వర్యంలోని కర్ణాటక రాష్ట్ర బీసీ కమిషన్‌ చేపట్టిన ఇంటింటి సర్వే గురించి తెలుసుకొనేందుకు ఆ రాష్ట్రంలో ప్రత్యేకంగా తెలంగాణ బీసీ కమిషన్‌ ఇటీవల పర్యటించి, ప్రత్యక్షంగా వారి అనుభవాలను సేకరించింది. 2014 జూన్‌లో కర్ణాటక ప్రభుత్వం బీసీ కమిషన్‌ను నియమించింది. దాని ద్వారా అన్ని కుటుంబాల సామాజిక, విద్యా, ఆర్థిక స్థితిగతులపై ఇంటింటి సర్వే జరుపడానికి ఏప్రిల్‌ 2014న స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దానికి ముందే సర్వే చేపట్టే అధికారాలు కల్పిస్తూ కర్ణాటక బీసీ కమిషన్‌ చట్టంలో సవరణ చేసింది. దీంతో పాటు రూ.193 కోట్లు ఆ రాష్ట్ర బీసీ కమిషన్‌కు కేటాయించి, 1 లక్షా 60వేల మంది ఉపాధ్యాయులను సర్వే వివ రాల సేకరణ అధికారులుగా నియమిస్తూ, ప్రత్యేక ఆదేశాలను జారీ చేసింది. దీనిపై ఆ రాష్ట్రంలో అనేక న్యాయపరమైన వివాదాలు, రాజకీయ విమర్శలు వచ్చినా అక్కడి ప్రభుత్వం సమర్థవంతంగా వాటిని ప్రక్కకు తప్పించింది.
 
1992 ఇంద్ర సహానీ కేసులో న్యాయబద్ధ, గణించదగ్గ, అన్ని కుటుంబాల సమగ్ర సామాజిక, విద్యా, ఆర్థిక స్థితిగతుల వివరాలు సేకరించినట్లైతే రిజర్వే షన్లు పెంచుకోవచ్చనే సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని కర్ణాటక సర్కార్‌ పరిగణనలోకి తీసుకొని అనేక జాగ్రత్తలు వహించింది. ప్రతి పది సంవత్సరాలకొకసారి కేంద్ర ప్రభుత్వం జనాభా గణన వివరాలు సేకరించేందుకు అనుసరించే విధానాలను ప్రతి అంశంలో కర్ణాటక బీసీ కమిషన్‌ అనుసరించింది. ముఖ్యంగా సర్వే ఫారం రూపకల్పన, ఎన్యుమరేటర్స్‌ ఎంపిక లక్ష సెన్సెస్‌ విభాగ విధానాలను అనుసరించింది. ఆ రాష్ట్రంలోనే 1కోటి 33 లక్షల కుటుంబాలకు గాను దాదాపు ‘‘1కోటి 31 లక్షల’’ కుటుంబాల వివరాలను సమగ్రంగా సేకరించింది. ప్రస్తుతం ఆ వివరాలను భారత ఎలక్ట్రానిక్‌ లిమిటెడ్‌ (BEL)సంస్థ సహాయంతో కంప్యూటరీకరణ, విశ్లేషణ జరుపుతున్నారు. ప్రతి జిల్లాకు కలెక్టర్లు, పంచాయితిరాజ్‌ అధికారులను పర్యవేక్షకులుగా నియమించి చేపట్టిన కర్ణాటక రాష్ట్ర సామాజిక, విద్యా, ఆర్థిక కుటుంబ సర్వే నివేదికను త్వరలో సిద్ధరామయ్య ప్రభుత్వానికి అక్కడి కమిషన్‌ సమర్పించనుంది. ఈప్రక్రియ మొత్తంలో ఎదురైన సవాళ్ళను తెలంగాణ బీసీ కమిషన్‌ క్షుణ్ణంగా క్షేత్ర స్థాయిలో బెంగళూరులో పర్యటించి మరీ అధ్యయనం జరిపి, వివరాలను సేకరించింది.
 
ఎంబీసీలుగా గుర్తించాలని కోరుతున్న కుల సంఘాలతో సమావేశమై వెనుకబాటుపై వివరాలుసేకరిస్తున్నది. అత్యంత వెనుకబడిన కులాల సామాజిక, విద్యా స్థితిగతులను చారిత్రక కోణంలో అంతరాల్లోకి తొంగి చూసి పరిశీలిస్తున్నది. అలాగే సంచార కులాల సమస్యలను అర్థం చేసుకోవడానికి నేరస్థ జాతుల విచారణ కమిషన్‌, బాలకృష్ణ సిద్రం రేణకే కమిషన్‌, ఇడాటే కమిషన్‌ల అధ్యయనాలు, కాకా కలేల్కర్‌, మండల్‌, అనంతరామన్‌ కమిషన్‌ల నివేదికలను అధ్యయనం చేయడంతో పాటు ప్రత్యక్షంగా ఆయా సంచార కులాల సమావేశాలకు హాజరైతూ వారి జీవనాన్ని దగ్గరగా చూస్తున్నది. ఈ విషయంలో ఎన్‌.వి.బలరాం వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (ఎ.ఐ.ఆర్‌. 1972, ఎస్‌.సి.1375) కేసులో కమిషన్‌ స్వంతంగా విషయ పరిజ్ఞానాన్ని సంపాదించడం వెనుకబాటుతనం నిర్ధారణకు ఆమోదయోగ్యమైన విధానమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ ఆచరణలో పాటిస్తున్నది.
 
దీంతో పాటు ప్రామాణికంగా తీసుకోవడానికి న్యాయపరమైన అవరోధాలున్నా సీఎం కేసీఆర్‌ జరిపించిన సమగ్ర కుటుంబ సర్వే బీసీ కమిషన్‌ అధ్యయనానికి వెలుగు బాటలు పరిచిందనడంలో సందేహం లేదు. తెలంగాణ సామాజిక స్వభావాన్ని అర్థంచేసుకోవడానికి గొప్ప శాస్త్రీయ వనరుగా సమగ్ర కుటుంబ సర్వే సహాయపడుతున్నది. తెలంగాణ జనాభాలో 51.08% పైగా ఉన్న బీసీ కులాల సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన స్థితి గతులపై నిర్ధిష్టమైన అంచనాకు సమగ్ర కుటుంబ సర్వే దోహదపడుతున్నది. అలాగే అకడమిక్‌ పరి శోధన సంస్థలతో సంప్రదింపుల ద్వారా విలువైన సమాచారం సేకరిస్తున్నది.
 
ఆరు దశాబ్దాల సమైక్యాంధ్ర పాలనలో గత ప్రభుత్వాలు అనుసరించిన పాలనా విధానాల వలన, ప్రపంచీకరణ, పెట్టుబడిదారీ మార్కెట్‌ వస్తువుల ప్రవాహం వలన గ్రామీణ కులవృత్తులలో ఏర్పడ్డ సంక్షోభంపై మనసు పెట్టి కమిషన్‌ పరిశోధిస్తున్నది. కళా రూపాలను ప్రదర్శిస్తూ, భిక్షాటనపై ఆధారపడి సంచార జీవితం గడుపుతున్న సంచార, అర్ధ సంచార, విముక్త జాతుల జీవన విధానాన్ని, దశాబ్దాలుగా వారు అనుభవిస్తున్న సామాజిక స్థాయిని, వివక్షను రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల వెలుగులో అధ్యయనం జరుపుతున్నది. అడవికీ, ఊరికి మధ్య సామాజిక వ్యవస్థ స్వరూపాన్ని విశ్లేషిస్తున్నది. మండల్‌ కమీషన్‌లో ఎల్‌.ఆర్‌.నాయక్‌ అనే సభ్యుడు పాక్షిక అసమ్మతిని వ్యక్తపరుస్తూ వెల్లడించిన ‘‘అట్టడుగు వెనుకబడిన తరగతుల’’ అంశాన్ని అధ్యయనం జరుపుతున్నది. దీంతో పాటు నేత, గీత కార్మికుల, తదితర వృత్తి కార్మికుల ఆత్మహత్యలు, చావులు, వలసలు, తదితర పరిణామాలన్నింటినీ వొడిసిపడుతున్నది. రాజ్యాంగ మౌలిక సూత్రాల వెలుగులో వెనుకబడిన కులాల, వర్గాల వాస్తవ జీవితాన్ని అద్దంలా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నది.
 
తెలంగాణ రాష్ట్ర తొలి శాసన సభ సమావేశంలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంలో ప్రసంగించిన సీఎం కేసీఆర్‌ తెలంగాణ వెనుకబడిన వర్గాల రాష్ట్రం, బడుగు, బలహీన వర్గాల మొహాలు వెలిగినపుడే, వారి కళ్ళల్లో ఆనందం వెల్లివిరిసినప్పుడే ఈ రాష్ట్రం ఏర్పడినందుకు సార్థకత ఉంటుందని గుండె లోతుల్లోంచి మాట్లాడిన మాటలే బీసీ కమిషన్‌ కార్యాచరణను నడిపిస్తున్నాయి.

డాక్టర్‌ ఆంజనేయగౌడ్‌
తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యులు