News

జియో మరో సంచలనం


రిలయన్స్ జియో.. సంచలనాలకు మారుపేరుగా నిలిచి మొబైల్ వినియోగదారులను తనవైపు తిప్పుకుంది. ఇప్పుడు మరో వ్యూహాత్మక ఎత్తుగడతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను చిత్తు చేసేందుకు దూసుకొస్తోంది. ఈ దెబ్బతో స్మార్ట్‌ఫోన్ల మార్కెట్ల కుప్పకూలడం ఖాయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 4జీ ఎల్టీటీ, వీవోఎల్టీఈ ఫీచర్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు దాదాపు ఏర్పాట్లు పూర్తి చేసింది. జియో అందిస్తున్న ఉచిత వాయిస్ కాల్స్‌ను ఈ ఫోన్లు సపోర్ట్ చేస్తాయి. 4జీ సిమ్‌లను ఎంచక్కా ఇందులో వేసి వాడుకోవచ్చు. అంతేకాదు ధర కూడా వెయ్యి రూపాయల లోపే. ఇవి కనుక అందుబాటులోకి వస్తే వినియోగదారులందరూ వీటినే తీసుకుంటారని నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు ఇది ఎదురుదెబ్బేనని అభిప్రాయపడుతున్నారు. ‘‘ఒకవేళ ఈ ఫోన్లు మార్కెట్లోకి వస్తే స్మార్ట్‌ఫోన్లను కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు’’ అని సైబర్ మీడియా రీసెర్చ్ అనలిస్ట్ ఫైజల్ కవూసా తెలిపారు. ఇది స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు సవాలుతో కూడుకున్న సమయమని ఆయన పేర్కొన్నారు. ముఖేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ మార్కెట్లోకి తీసుకురానున్న 4జీ ఫీచర్ ఫోన్లలో ముందు, వెనక కెమెరాలుంటాయి. జియో చాట్, లైవ్ టీవీ, వీడియో ఆన్ డిమాండ్ తదితర యాప్స్ కూడా ఉంటాయి. అంతేకాదు రిలయన్స్ జియోకు చెందిన జియో మనీ వాలెట్ సర్వీసు కూడా ఇందులో ఉంటుంది. ఈ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన క్షణం నుంచి స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లు తిరోగమనంలో పయనిస్తాయని నిపుణులు చెబుతున్నారు.