News

జగన్, పవన్‌లకు యనమల సూటి ప్రశ్న


బీజేపీ పార్లమెంటరీపార్టీలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అపరిపక్వత, అవగాహనలేమి బీజేపీ అధినాయకత్వానిదే అని విమర్శించారు. పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానంతో బీజేపీ మోసాన్ని ఎండగట్టామని...దీంతో బీజేపీకి ఎవరు అనుకూలమో, ఎవరు ప్రతికూలమో తేలిపోయిందన్నారు. రాబోయే ఎన్నికల్లో మోదీకి ప్రజలు మొండిచేయి చూపుతారని మంత్రి యనమల స్పష్టం చేశారు. మోదీ ఏమాయ చేశారో జగన్, పవన్ వెల్లడించాలని డిమాండ్ చేశారు. ‘సుప్రీంలో కేంద్రం వేసిన అఫిడవిట్లపై ఆ ఇద్దరు ఎందుకు స్పందిచరు?... మోదీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలపై జగన్, పవన్ ఎందుకు మాట్లాడరు..?’ అని మంత్రి నిలదీశారు. జగన్, పవన్ ఇద్దరి దృష్టి సీఎం కుర్చీపైనే అని దుయ్యబట్టారు. నియోజకవర్గానికో మాట, జిల్లాకో వైఖరి వైసీపీ విధానమన్నారు. మాట తప్పడం, మడమ తిప్పడంలో జగన్‌కు ఎవరూ సాటిలేరని మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు.