News

తెలంగాణ పంచాయతీ రిజర్వేషన్లు కొలిక్కి


తెలంగాణ పంచాయతీ రిజర్వేషన్లు కొలిక్కి వస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం 50 శాతానికి మించకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వ్ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. 2011 జనాభా దామాషా ప్రకారం 50 శాతం సీట్లలో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించి, మిగిలినవాటిలో బీసీలకు సీట్లు కేటాయిస్తారు. ఈ ప్రక్రియలో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లో పంచాయతీరాజ్ కమిషనర్ నీతూప్రసాద్ అధ్యక్షతన డీపీవోలకు పంచా యతీ రిజర్వేషన్లు, ప్రభుత్వ ఆర్డినెన్స్‌పై అవగాహన సమావేశం నిర్వహించి రిజర్వేషన్ల కేటాయింపు సమయంలో తలెత్తే సందేహాలను కమిషనర్ నివృత్తి చేశారు. మండలాన్ని యూనిట్‌గా తీసుకొని జిల్లా కలెక్టర్లు, గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని ఆర్డీవోలు రిజర్వేషన్లు ఖరారు చేయాలని నీతూప్రసాద్ సూచించారు. ఈనెల 27, 28వ తేదీల్లో జిల్లాస్థాయిలో రిజర్వేషన్ ప్రక్రియను పూర్తిచేసి జల్లాస్థాయి గెజిట్‌లను ప్రకటించాలని నిర్ణయించినట్టు సమాచారం. జిల్లాల నుంచి వచ్చిన గెజిట్లను పరిశీలించి, ఈ నెల 30, 31 తేదీల్లో రాష్ట్రస్థాయిలో రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం జీవోను రూపొందించి.. ఎన్నికల కమిషన్‌కు సమర్పించనుంది. ఈసీ ఆ ఉత్తర్వులను పరిశీలించి జనవరి 2 నుంచి 10వ తేదీలోగా ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశ ముంది.
10,293 పంచాయతీల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ...
రాష్ట్రంలోని 12,751 గ్రామపంచాయతీల్లో 100 శాతం జనాభా ఉన్న షెడ్యూల్ ఏరియాలోని 2,458 పంచాయతీలు ఎస్టీలకు దక్కనున్నాయి. ఇవి పోగా 10,293 పంచాయతీల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించనున్నారు. దీనిప్రకారం ఎస్టీలకు 688, ఎస్సీలకు 2113, బీసీలకు 2345, జనరల్‌కు 5147 స్థానాలు రిజర్వ్ కానున్నట్లు సమాచారం. మొత్తం12,751 పంచాయతీల్లో 50 శాతం అంటే దాదాపు 6,375 పంచాయతీలు మహిళలకు దక్కనున్నాయి. సుమారు 3,126 పంచాయతీల్లో ఎస్టీలు సర్పంచులుగా ఎన్నికకానున్నారు.