News

పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలి


రాష్ట్రంలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాలని నిర్మ‌ల్ ఎమ్యెల్యే, మాజీ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమ‌వారం ప‌ట్ట‌ణంలోని దివ్యా గార్డెన్స్‌లో నిర్మ‌ల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్ర అభివృద్దే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని, రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు, రైతు బీమా పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. కేటీఆర్ పార్టీ పగ్గాలు చేపట్ట‌డంతో టీఆర్‌ఎస్ మ‌రింత బలోపేతమ‌వుతుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కార్యకర్తలందరూ శ్రమించి భారీ మెజార్టీని కట్టబెట్టారన్నారు. మీ కృషి ఎన్నటికీ మరువలేమన్నారు. పార్టీకి కార్యకర్తలే ముఖ్యమన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, పార్టీ బలోపేతం కోసం పని చేసే కార్యకర్తలకు తగిన గుర్తింపునివ్వడం జరుగుతుందన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సాధ్యమైనంత వరకు ఏకగ్రీవం అయ్యేలా చూసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఏకగ్రీవంగా ఎంపికైతే రూ.10లక్షలు, తండాలు ఏకగ్రీవం అయితే రూ.25 లక్షలు అభివృద్ధికి ప్రభుత్వం కేటాయించడం జరుగుతుందన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ గ్రామ స్థాయిలో బూత్ లేవల్ కమిటీలను నియమించుకొని రానున్న గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, పార్లమెంటు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. జిల్లాలో త్వరలో జిల్లా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కేటీఆర్ నాయకత్వంలో 31 జిల్లాలో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నార‌న్నారు.